ఏపీలో ఐదుగురి అరెస్టు

23 Sep, 2022 05:39 IST|Sakshi

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌:  సోదాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాతో          సంబంధాలున్న గుంటూరు చెందిన అబ్దుల్‌ వహీద్‌ అలీ, షేక్‌ జఫ్రుల్లా, అబ్దుల్‌ రహీం, రియాజ్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. కర్నూలుకు చెందిన అబ్దుల్‌ వారిస్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.   

తీగ లాగితే కదిలిన డొంక  
దేశంలో మతకల్లోలాలు సృష్టించేందుకు పీఎఫ్‌ఐ తెలంగాణలోని నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. నిజామాబాద్‌లో సోదాలు నిర్వహించగా డొంకంతా కదిలింది. కొన్ని రోజుల క్రితం గుంటూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి దాటాక గుంటూరు, కర్నూలులో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టారు. గుంటూరులో పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యాలయాలతోపాటు పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. నలుగురిని అరెస్టు చేశారు.

అరెస్టయిన వారిలో అబ్దుల్‌ వహీద్‌ అలీ, అబ్దుల్‌ రహీంలు పీఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు. ప్రస్తుతం పీఎఫ్‌ఐ విస్తరణ విభాగం ఇన్‌చార్జ్‌లు. షేక్‌ జఫ్రుల్లా పీఎఫ్‌ఐ సభ్యుడు కాగా రియాజ్‌ అహ్మద్‌ పీఎఫ్‌ఐ రాజకీయ విభాగం ఎస్‌డీపీఐ జిల్లా అధ్యక్షుడు. గుంటూరు జిల్లా పీఎఫ్‌ఐ అధ్యక్షుడు యూసుఫ్‌కు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. 29న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కర్నూలులో వారిస్‌ ఇంట్లో ఎస్‌డీపీఐకి సంబంధించిన కరపత్రాలు, మినిట్స్‌ బుక్, బైలా బుక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐ సభ్యులకు అతడే శిక్షణా తరగతులు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది.   

పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్‌
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో పీఎఫ్‌ఐ కార్యాలయాన్ని ఎన్‌ఐఏ సీజ్‌ చేసింది. విచారణకు హాజరు కావాలని సంబంధిత ప్రతినిధులను ఆదేశించారు. కరీంనగర్‌లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. పీఎఫ్‌ఐ సానుభూతిపరులను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. పీఎఫ్‌ఐకి అందుతున్న నిధులపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేయనున్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు