వరవరరావు బెయిల్‌ను వ్యతిరేకించిన ఎన్‌ఐఏ

18 Aug, 2020 05:17 IST|Sakshi

ముంబై: విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు (81) బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఆమోదించవద్దని కోరింది. ఎల్గార్‌ పరిషద్‌– కోరేగావ్‌ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. జస్టిస్‌ అమ్జాద్‌ సయిద్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్‌ ఇవ్వవద్దని ఎన్‌ఐఏ న్యాయవాది అనిల్‌సింగ్‌ వాదించారు. ఈ సందర్భంగా  వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్‌లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్‌లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు