ఎన్‌ఐఏ మెరుపు దాడులు.. మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు

15 Feb, 2023 11:38 IST|Sakshi

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కోయంబత్తూరు, మంగళూరు నగరాల్లో జరిగిన రెండు వేరువేరు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులుగా అనమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేపట్టింది.

కాగా గతేడాది అక్టోబర్‌ 23న తమిళనాడులోని కోయంబత్తూరులో కొట్టె ఈశ్వరన్‌ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనుమానిత ఉగ్రవాది జమేషా మబీన్‌ మరణించాడు. దీనిపై అక్టోబర్‌ 27న ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్‌ చేసింది. జమీజా ముబీన్ తన సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌తో కలిసి ఆలయ సముదాయాన్ని దెబ్బతియాలనే ఉద్ధేశంతో ఆత్మాహుతి దాడికి ప్లాన్‌ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.

అదే విధంగా 2022 నవంబర్‌ 19న కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్‌ బాంబు పేలింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తోపాటు ప్రెషర్‌ కుక్కర్‌ తీసుకెళ్తున్న నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. ఈ కేసుపై డిసెంబర్‌లో ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. పలు కేసుల్లో నిందితుడు షరీక్ రాష్ట​రాంష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు  ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్‎కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే

మరిన్ని వార్తలు