మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

1 Jun, 2023 06:00 IST|Sakshi

డిజిటల్‌ పరికరాలు, రూ.17.50 లక్షల నగదు స్వాధీనం 

పీఎఫ్‌ఐ కుట్రలపై దర్యాప్తు  

న్యూఢిల్లీ/బనశంకరి: నిషేధిత ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కుట్రలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బిహార్‌లోని కతీహర్‌ జిల్లా, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, షిమోగా జిల్లాలు, కేరళలోని కాసర్‌గోడ్, మలప్పురం, కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో మొత్తం 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. అనుమానితుల నివాసాల్లో సోదాలు చేపట్టినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలియజేశారు.

మొబైల్‌ ఫోన్లు, హార్డ్‌డిస్కులు, సిమ్‌ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లు, డేటా కార్డులు, ఇతర డిజిటల్‌ పరికరాలు, పత్రాలు, పీఎఫ్‌ఐకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.17.50 లక్షల నగదు లభ్యమైందని వివరించారు. భారత్‌లో విధ్వంసకర కార్యకలాపాల కోసం పీఎఫ్‌ఐకి విదేశాల నుంచి హవాలా డబ్బు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కర్ణాటకలోని బంట్వాళ, పుత్తూరుల్లో నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. కేరళలోని కాసరగోడ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు సంబంధించి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

కశ్మీర్‌లోనూ...
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గామ్‌ జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి చెప్పారు. పాక్‌ దన్నున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్‌ ముజాహిదీన్, అల్‌–బదర్, అల్‌కాయిదా ఉగ్ర సంస్థల అనుబంధ సంస్థల సభ్యులు, సానుభూతిపరుల నివాసాల్లో సోదాలు జరిగాయి. ద రెసిస్టెన్స్‌ ఫోర్స్, యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌–జమ్మూకశ్మీర్, ముజాహిదీన్‌ గజ్వాత్‌–ఉల్‌–హింద్, జమ్మూకశ్మీర్‌ ఫ్రీడం ఫైటర్స్, కశ్మీర్‌ టైగర్స్, పీపుల్స్‌ యాంటీ–ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రవాద సంస్థలు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చాయి.

మరిన్ని వార్తలు