అంబానీ ఇంటి వద్ద పేలుడు: సచిన్‌ వేజ్‌కు 25 వరకు కస్టడీ

15 Mar, 2021 09:16 IST|Sakshi
పోలీసు వాహనంలో ఉన్న సచిన్‌ వేజ్‌

ముంబై: రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద లభించిన పేలుడు పదార్థాలతో కూడిన కారు కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్‌ వేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది. 49 ఏళ్ల వయసున్న సచిన్‌ వేజ్‌ ఫిబ్రవరి 25న అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారుని పార్కు చేశారన్న ఆరోపణలతో ఎన్‌ఐఏ ఆయనని శనివారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌ చేసింది. ఆదివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వేజ్‌ను దక్షిణ ముంబైలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనని ఈ నెల 25వరకు ఎన్‌ఐఏ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొదట పోలీసు అధికారి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేయడానికి ఎన్‌ఐఏ ఆయనకి సమన్లు పంపింది.

శనివారం ఉదయం 11.30కి కంబాలా హిల్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి చేరుకున్న వేజ్‌ని 12 గంటల సేపే జాతీయ దర్యాప్తు బృందం అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అనంతరం ఆయనని ఐపీసీ, ఎక్స్‌ప్లోజివ్‌ సబ్‌స్టెన్స్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం లభ్యం కావడమే కలకలాన్ని సృష్టిస్తే ఆ కారు తన దగ్గర్నుంచి అంతకు వారం రోజుల ముందే చోరీకి గురైందని థానేకు చెందిన వ్యాపారి మన్‌సుఖ్‌ హిరాణ్‌ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మార్చి 5న ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో కేసుని ఎన్‌ఐఏకి అప్పగించారు. 

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు 
1990 బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన సచిన్‌ వేజ్‌కు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు అన్న పేరుంది. మొత్తంగా 63 మంది క్రిమినల్స్‌ని ఆయన ఎన్‌కౌం టర్‌ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఘట్కోపార్‌ పేలుళ్లలో అనుమానితుడు ఖ్వాజా యూనస్‌ కస్టడీ మరణంలో సచిన్‌ ప్రమేయం ఉందని తేలడంతో 2004లో ఆయనని సస్పెండ్‌ చేశారు. తిరిగి గత ఏడాదే ఆయన విధుల్లోకి వచ్చారు. గత ఏడాది అన్వయ్‌ నాయక్‌ ఆత్మహత్య కేసులో జర్నలిస్టు అర్ణబ్‌ గోస్వామి అరెస్ట్‌ చేసిన పోలీసు బృందానికి వేజ్‌ నేతృత్వం వహించారు. 2008 వరకు ఆయన శివసేనలో కూడా కొనసాగారు.

మరిన్ని వార్తలు