ఈ నెల 22న శిక్ష ఖరారు చేయనున్న ఎన్‌ఐఏ కోర్టు

12 Sep, 2020 19:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భారీ ఉగ్ర కుట్రకు పథకం పన్నిన కేసుకు సంబంధించి మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. డిసెంబర్ 2015లో ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసులో మొత్తం 15 మందికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్‌లో చేరేలా ప్రేరేపించిన 19 మందిని ఎన్‌ఐఏ 2015 లో అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్‌కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో ఎన్‌ఐఏ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో "జునోధ్ ఉల్ ఖిలాఫా ఫీల్ హింద్" పేరుతో గ్రూప్ ఫామ్ చేసి ఐసిస్‌ కుట్రను నెరవేర్చేందుకు 19 మంది ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దేశంలో పేళ్లులకు భారీ కుట్ర రచించారు. (చదవండి: నరేంద్ర మోదీకి బెదిరింపు మెయిల్‌)

ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూర్, మహారాష్ట్ర, యూపీలలో ఐసిస్‌ సానుభూతిపరులు మీటింగ్‌లు కూడా నిర్వహించారు. సిరియాలో ఉంటున్న యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అంజన్ భాయ్ ఆదేశాలను అమలు చేయడం వీరి పని. ఐసిస్‌ మీడియా చీఫ్‌గా అంజన్ భాయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ 2016-17 మద్యలో ఈ కేసుకు సంబంధించి 17 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరిలో 15 మందిపై నేరం రుజువయ్యింది. వీరికి ఈ నెల 22న ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 

>
మరిన్ని వార్తలు