ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు

30 Jun, 2021 07:48 IST|Sakshi

కేంద్ర హోంశాఖ నిర్ణయం 

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్మూలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) స్థావరంపై డ్రోన్ల దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తునకు ఆదేశిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడికి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేందుకే దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించినట్లు హోం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. జమ్మూ విమానాశ్రయానికి సమీపంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఆదివారం  అర్థరాత్రి డ్రోన్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే.

లష్కరే టాప్‌ కమాండర్‌ అబ్రార్‌ హతం
ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ నదీమ్‌ అబ్రార్‌ మంగళవారం  హతమయ్యాడు. సోమవారం భద్రతాబలగాలు అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అతడిని తీసుకుని వెళ్లి మంగళవారం మలూరాలోని ఓ ఇంటిని చుట్టుముట్టగా ఆ ఇంట్లో నక్కి ఉన్న పాక్‌ ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడగా అబ్రార్‌ మృతి చెందాడు.

చదవండి:
డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికత!
Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే!

>
మరిన్ని వార్తలు