నిందితుడిని ఉరి తీయండి లేదా ఎన్‌కౌంటర్ చేయండి

2 Nov, 2020 14:16 IST|Sakshi
నికితా తోమర్ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని సమీపంలోని ఫరిదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న యువతి నికితా తోమర్‌ (21) హత్య ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు మత మార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తౌసీఫ్ తమ బిడ్డను బలితీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గత మూడు రోజులుగా ఇంటి ఆరు బయట కూర్చోని నిరసన తెలుపుతున్నారు. లవ్‌ జిహాద్ పేరుతో నికితా తోమర్‌ను అతి కిరాతకంగా హతమార్చిన తౌసీఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలతో పాటు, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ‘వెంటనే ఆ దుర్మార్గుణ్ని కాల్చి చంపండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’ అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటుతున్నాయి.

కాగా గత నెల 26న ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో పరీక్ష రాసి వస్తుండగా నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. ఆమెపై కాల్పులు జరిపుతున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమవుతున్నారు. (పెళ్లి కోసమే మతం మారడం సరికాదు)

అయితే గతంలో కేరళ యువతి వివాహం కేసులో హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చిన లవ్‌ జిహాద్‌.. తాజాగా నికిత హత్యతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో పెళ్లి కోసం కొంతమంది యువతీ, యువకులు మతం మారడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే పెను వివాదానికి దారితీస్తోంది. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త చర్చకు దారితీస్తోంది.

వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని న్యాయస్థానం సంచనల తీర్పును వెలువరించింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదంటూ 2014లో ఇచ్చిన తీర్పును ఉటంకించారు. అయితే జాతీయ స్థాయిలో లవ్‌ జిహాద్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు, ఆ మత విధానాలను పాటించవచ్చు.

మరిన్ని వార్తలు