గుజరాత్‌లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి

5 Nov, 2020 04:39 IST|Sakshi
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

అహ్మదాబాద్‌: కెమికల్‌ గోడౌన్‌లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 12 మంది మరణించారు. ఈ దుర్ఘటన అహ్మదాబాద్‌ నగర శివారులో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. మరణించిన 9 మంది కూలీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు చెప్పారు. గాయపడిన మరో 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కెమికల్స్‌ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బలగాలు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నాయి.

శిథిలాల కింద చిక్కుకున్న 18 మందిని వెలికితీసి అంబులెన్సుల ద్వారా హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. అయితే అందులో 12 మంది మరణించారని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద అణువణువూ గాలిస్తున్నామని, ప్రమాదంపై విచారణ సాగిస్తున్నామని డీసీపీ అశోక్‌ మునియా చెప్పారు. కెమికల్‌ గోడౌన్‌లోని బాయిలర్‌ వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని స్థానిక ఫ్యాక్టరీల యజమానులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో గోడలు పగిలి స్లాబ్‌ కూలిందని గోడౌన్‌ పక్కన భవనాల్లో పనిచేస్తున్న కూలీలు చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ట్వీట్‌ చేశారు.  
 

మరిన్ని వార్తలు