Rajasthan Car Tragedy: నదిలో పడిపోయిన పెళ్లి బృందం వాహనం

21 Feb, 2022 05:09 IST|Sakshi

వరుడితో సహా 9 మంది మృతి

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం

కోట(రాజస్తాన్‌): రాజస్తాన్‌లోని కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడిపోవడంతో వరుడితో సహా 9 మంది మృతిచెందారు. ఈ పెళ్లి బృందం ఆదివారం తెల్లవారుజామున సవై మాధోపూర్‌ జిల్లాలోని చౌత్‌ కా బర్వారా గ్రామం నుంచి ఎర్టిగా వాహనంలో బయలుదేరింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం 5.30 గంటలకు బ్రిడ్జిపై వెళ్తూ చంబల్‌ నదిలో పడిపోయింది. నిద్రమత్తు కారణంగా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

ఈ దుర్ఘటనలోవరుడు అవినాశ్‌ వాల్మీకి(23), అతడి సోదరుడు కేశవ్‌(30), కారు డ్రైవర్‌ ఇస్లాం ఖాన్‌(35), బంధువులు కుశాల్‌(22), శుభం(23), రోహిత్‌ వాల్మీకి(22), రాహుల్‌(25), వికాశ్‌ వాల్మీకి(24), ముకేశ్‌ గోచర్‌(35) చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం పట్ల కోట–బుండీ ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం అశోక్‌ గహ్లోత్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు