అర్బన్‌ ప్లానింగ్‌ బలోపేతం కావాలి: నీతిఆయోగ్‌

17 Sep, 2021 04:15 IST|Sakshi

సామర్థ్యం పెంపునకు సంస్కరణలు

సిఫారసు చేసిన నీతిఆయోగ్‌

52 శాతం పట్టణాలకు మాస్టర్‌ ప్లాన్‌ లేదన్న నివేదిక

టౌన్‌ ప్లానింగ్‌ చట్టాలను సమీక్షించాలి  

సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్‌ ప్లానింగ్‌ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్‌ ప్లానింగ్‌ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ కె.రాజేశ్వర్‌ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్‌ ఈ నివేదికను రూపొందించింది.

‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్‌ ప్లాన్‌ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్‌ ప్లానర్‌ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్‌ ప్లానర్‌ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లాన్‌ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్‌ కూడా లేరని నివేదిక పేర్కొంది.

నివేదిక సిఫారసులు
► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్‌ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి.  

► ప్రతిపాదిత హెల్తీ సిటీస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి.  

► ప్రభుత్వ రంగంలో అర్బన్‌ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్‌ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్‌ ఎంట్రీ పొజిషన్స్‌గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి.  

► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్‌ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్‌ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి.  

► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.

► మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి.

►  సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి.  

► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సులు అందించాలి.  

► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌’ను నెలకొల్పాలి. ‘నేషనల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్‌ ప్లానర్స్‌ రిజి్రస్టేషన్‌ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి.  

మరిన్ని వార్తలు