గడ్కరీ ఛాలెంజ్: ఆ బీజేపీ ఎంపీ 32 కేజీలు ఎలా తగ్గాడో తెలుసా?

18 Oct, 2022 10:17 IST|Sakshi

ఢిల్లీ: అనిల్‌ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా?.. అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ షరతు విధించడం.. అది ఛాలెంజ్‌గా తీసుకుని వర్కవుట్లు చేస్తూ బరువు తగ్గించుకునేందుకు యత్నించిన బీజేపీ ఎంపీ. ఆ ఎంపీ ఇప్పడు ఏకంగా 32 కేజీల బరువు తగ్గారట. 

పొద్దున్నే ఐదున్నరకు లేచి నడక. ఆపై రన్నింగ్‌, ఎక్సర్‌సైజ్‌లు, యోగాలతో కూడిన వర్కవుట్స్‌. ఆయుర్వేదిక్‌ డైట్‌ పాలో కావడం. ఆపై లైట్‌ బ్రేక్‌ఫాస్ట్‌. లంచ్‌, డిన్నర్‌లోకి సలాడ్‌, ఒక గిన్నెలో గ్రీన్‌ వెజిటెబుల్స్‌, మిశ్రమ తృణధాన్యాలలతో చేసిన ఒక రోటీ, క్యారట్‌ సూప్‌, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్‌.. ఇవి మాత్రమే తిని ఆయన తన బరువును ఏకంగా 30 కేజీలకు పైగా తగ్గించుకున్నారట. అలా ఎనిమిది నెలలకు పైగా ఇష్టాలను కట్టడి చేసుకుని.. కష్టం మీద బరువును నియోజకవర్గం కోసం తగ్గించుకున్నారాయన!. 

ఈ మేరకు సోమవారం ఉజ్జయిని ఎంపీ(మధ్యప్రదేశ్‌) అనిల్‌ ఫిరోజియా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి తాను బరువు తగ్గిన విషయాన్ని వెల్లడించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన గడ్కరీ.. ఫిరోజియాను అభినందించి ఇచ్చిన మాట ప్రకారం.. తొలి దశలో రూ.2,300 కోట్ల అభివృద్ది నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. గడ్కరీ స్ఫూర్తితో పాటు ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్‌ భారత్‌ పిలుపు తనను ఆకర్షించాయని చెప్తున్నారాయన. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉజ్జయినిలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. ఫిరోజియాగారికి ఒక షరతు. ఆ పని చేస్తేనే నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తా. ఒకప్పుడు నా బరువు 135 కేజీలు ఉండేది. అది ఫిరోజియాగారి కంటే ఎక్కువ. ఇప్పుడు నా బరువు 93 కేజీలు. నా పాత ఫొటోను కూడా ఆయనకు చూపించా. అందులో నన్ను గుర్తు పట్టడం కష్టమే. ఒక వేళ ఫిరోజియా గనుక బరువు తగ్గితే.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తా అని ప్రకటించారు.

ఇదీ చదవండి: ప్లీజ్‌ సార్‌.. మా అమ్మను అరెస్ట్‌ చేయండి!!

>
మరిన్ని వార్తలు