దేనికి అసంతప్తి?.. సంతోషంగానే ఉన్నా.. గడ్కరీ తీవ్ర అసహనం

6 Sep, 2022 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. గతంలో ఆయన స్టేట్‌మెంట్లను.. తాజాగా చేస్తున్న ప్రకటనలనూ కేంద్రంపై విమర్శే అనే కోణంలో ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో నితిన్‌ గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

మంగళవారం  ఐఏఏ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంలోనూ నేను అసంతృప్తిగా లేను. పూర్తి సంతోషంగా పని చేసుకుంటున్నా. నా వ్యాఖ్యలతో లేనిపోని వివాదాలు సృష్టించడం ఆపండి అంటూ ఆయన మీడియాకు చురకలు అంటించారు. ‘‘మీడియా అడిగితే అంతా నేను వాస్తవాలే మాట్లాడతా. కానీ, నేను అనని మాటల్ని కూడా నాకు ఆపాదించడం ఎందుకు?. దయచేసి ఓ విశ్లేషణ టీంను నియమించుకుని.. నా ప్రసంగాలను విశ్లేషించండి. అందులో నేను ఏదైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తే.. ఏ శిక్షకైనా నేను రెడీ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష ప్రీతిపాత్రుడైన బీజేపీ నేతగా గడ్కరీకి ఓ గుర్తింపు ఉంది. అంతెందుకు ఆయన ప్రకటనలను ఆధారంగా చేసుకునే కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రధాని మోదీ, బీజేపీని విమర్శిస్తుంటుంది. ఈ తరుణంలో గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించాక సైతం విపక్షాలు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రసంగాలను కేంద్రానికి వ్యతిరేక కోణంలోనే విశ్లేషిస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు.

నా పాత వీడియోను చూపించి.. సంచలనం సృష్టించాలన్నది కొన్ని మీడియా హౌజ్‌ల అభిమతంగా కనిపిస్తోంది. ఈమధ్య మహారాష్ట్రలో నేను చేసిన ప్రసంగాన్ని ఓ రిపోర్టర్‌ తప్పుగా చూపించాడు. సిబ్బంది తప్పిదంతోనే అలా జరిగిందని వాళ్లు నాకు వివరణ ఇచ్చుకున్నారు. తప్పులు సహజమే. కానీ, ఇలాంటి తప్పులు అపార్థాలకు దారి తీస్తాయి అని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. 

వక్రీకరించొద్దు
ఏనాడూ నేను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీకు దమ్ముంటే.. మీరు ఎవరినైనా విమర్శించాలంటే నేరుగా విమర్శించండి. అంతేగానీ ఈ వ్యవహరంలోకి నన్నులాగడం ఎందుకు?. నా వ్యాఖ్యలను వక్రీకరించడం ఎందుకు? మహారాష్ట్ర ప్రసంగంలో..  జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమం స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పాను. స్వాతంత్రానికి పూర్వం.. రాజకీయాలు దేశభక్తితో కూడుకుని ఉండేవి. కానీ, తర్వాత అవి దేశ అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చింది అనే కోణంలోనే నేను మాట్లాడాను. కానీ, రాజకీయాలను వదిలేయాలని ఉందని విమర్శాత్మక కోణంలో వ్యాఖ్యలేమీ నేను చేయలేదు. అక్కడ నేను అనని మాటల్ని నా పేరుతో ఆరు, ఏడేసి కాలమ్స్‌లో రాశారు. అసలు ఏం జరిగిందని గడ్కరీ ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు?..  నా పనేదో నేను చూసుకుంటున్నా. సంతోషంగా ఉన్నా. ఎవరి పట్ల నాకు తప్పుడు ఉద్దేశాలు లేవు అంటూ అసంతృప్తి లేదనే విషయాన్ని గడ్కరీ ఇలా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: యాత్రతో అయినా రాత మారేనా?

మరిన్ని వార్తలు