ట్రక్‌ డ్రైవర్లకు డ్రైవింగ్‌ గంటలు!

22 Sep, 2021 05:02 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం కసరత్తు

నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రమంత్రి గడ్కరీ

సాక్షి, న్యూఢిల్లీ: కమర్షియల్‌ ట్రక్‌ డ్రైవర్ల అలసట, నిద్రలేమి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పైలట్ల మాదిరిగానే ట్రక్‌ డ్రైవర్లకు సైతం రోజుకి ఎంతసేపు వాహనాన్ని నడపాలన్న విషయంలో డ్రైవింగ్‌ గంటలను నిర్ణయించాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. వాణిజ్య ట్రక్కు డ్రైవర్ల నిద్రలేమి కారణంగా జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై మంత్రి నితిన్‌ గడ్కరీ నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) సమావేశంలో ఉన్నతాధికారులతో చర్చించారు.

ఈ ఏడాది జూలై 28న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి 13 మంది నాన్‌–అఫీషియల్‌ కో–ఆప్టెడ్‌ వ్యక్తిగత సభ్యులు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్‌ వి.కె. సింగ్‌ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే విషయంలో సభ్యులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. యూరోపియన్‌ ప్రమాణాలను అనుసరిస్తూ కమర్షియల్‌ వాహనాల్లో ఆన్‌బోర్డ్‌ స్లీప్‌ డిటెక్షన్‌ సెన్సార్ల ఏర్పాటుపైనా చర్చించారు.  కనీసం రెండు నెలలకోసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించుకోవాలని కౌన్సిల్‌ని గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతపై చర్చించేందుకు క్రమం తప్పకుండా  రహదారి భద్రత కమిటీల సమావేశాలు జరిగేలా చూడాలని రాష్ట్రాలకు లేఖలు రాయనున్నట్లు గడ్కరీ తెలిపారు. 

మరిన్ని వార్తలు