‘కండోమ్‌’ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్‌.. చర్యలకు సీఎం ఆదేశం!

29 Sep, 2022 19:18 IST|Sakshi

పాట్నా: శానిటరీ పాడ్‌లపై ఓ విద్యార్థి ప్రశ్నకు వెటకారంగా ‘కండోమ్‌’లు పంచమని అడుగుతారేమో అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్‌ అధికారిని హర్‍జోత్‌ కౌర్‌ భమ్రా చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్‌ అధికారిని హర్‌జోత్‌ కౌర్‌పై  చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.  

సెప్టెంబర్‌ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్‌ అధికారిని హర్‌జోత్‌ కౌర్‌ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. దీనిపై సీఎం నితీశ్‌ కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలిసింది. ఈ వివాదంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర మహిళలకు అన్ని విధాల సహాయం చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్‌ అధికారిని ప్రవర్తన ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

ఐఏఎస్‌ అధికారిని హర్‌జోత్‌ కౌర్‌ భమ్రా అదనపు చీఫ్‌ సెక్రెటరీ ర్యాక్‌ ఆఫీసర్‌, బిహార్‌ మహిళా, శిశు సంక్షేమ కమిషన్‌ హెడ్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘సాశక్త్‌ భేటీ.. సమృద్ధ బిహార్‌’ పేరుతో యూనిసెఫ్‌ భాగస్వామ్యంతో సెప్టెంబర్‌ 27న పాట్నాలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర‍్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని లేచి ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు, యూనిఫాం ఇస్తున్నప్పుడు శానిటరీ పాడ్‌లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. దీనికి ఐఏఎస్‌ అధికారిని వెటకారంగా సమాధానం ఇచ్చారు. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్‌ ప్యాంట్స్‌ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్‌ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్‌ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

ఇదీ చదవండి: వీడియో: శానిటరీ పాడ్స్‌పై ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారిణి వివరణతో షాక్‌ తిన్న విద్యార్థినులు

మరిన్ని వార్తలు