నితీశ్‌ ఈ జన్మలో ప్రధాని కాలేడు.. ఆర్జేడీతోనే జేడీయూ సర్వనాశనం!

3 Sep, 2022 19:14 IST|Sakshi

పాట్నా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. పాత మిత్రపక్షాలతో బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దల్‌ యునైటెడ్‌కు(జేడీయూ) మామూలు ఝలక్‌లు తగలడం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే ఈమధ్యే బీజేపీలో చేరిపోగా.. తాజాగా ఊహించని రీతిలో మణిపూర్‌లో పెద్ద షాక్‌ తగిలింది. ఏకంగా ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూ.. పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో జేడీయూపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. 

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని కావాలని నితీశ్‌ కుమార్‌ కంటున్న కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆర్జేడీతో జేడీయూ సర్వనాశనం అవుతుందని బీజేపీ సీనియర్‌ నేత, బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లు ఇప్పుడు జేడీయూ నుంచి విముక్తి పొందాయి. త్వరలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఉన్న జేడీయూను చీల్చడం ఖాయం. అప్పుడు  జేడీయూ ముక్త బీహార్‌ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీశ్‌ భావిస్తున్నట్లు ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం ఈ జన్మలో నెరవేరదు  అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుశీల్‌ మోదీ. 

ఇక డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారన్న జేడీయూ చీఫ్‌ ఆరోపణలను సుశీల్‌ మోదీ ఖండించారు. రంజన్‌ లలన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. డబ్బుకు లొంగిపోయేంత బలహీనులా వాళ్ల ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్లకా జేడీయూ టికెట్లు ఇచ్చింది? అని సెటైర్లు వేశారాయన. వాళ్లు మొదటి నుంచి ఎన్డీయేలో కొనసాగాలనుకుంటున్నారు. జేడీయూ ఇప్పుడేమో ఎన్డీయేకు దూరం జరిగింది. కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన వాళ్లకు నచ్చలేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అని సుశీల్‌ మోదీ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: అదే జరిగితే 2024లో సీన్‌ వేరేలా ఉంటుంది

మరిన్ని వార్తలు