బీజేపీతో ఇంకా టచ్‌లోనే.. ఇదే సాక్ష్యం మరి!

21 Oct, 2022 10:50 IST|Sakshi

పాట్నా: బీజేపీతో బంధం తెంచుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ త్వరలో మళ్లీ బీజేపీ పంచన చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంచనా వేస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతో కలవనని నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా కౌంటర్‌ వేశారు.

బిహార్‌లోని పశ్చిమచంపారన్‌ జిల్లాలో పాదయాత్రలో మద్దతుదారులను ఉద్దేశిస్తూ పీకే ప్రసంగించారు.‘బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు!. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్‌ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్‌ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ, 

అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్‌ ద్వారా నితీశ్‌ ఇంకా బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు’ అని ప్రశాంత్‌ పేర్కొన్నారు.‘ప్రశాంత్‌ ఏం చేయగలడనేది దేశవ్యాప్తంగా సీనియర్‌ రాజకీయనేతలందరికీ తెలుసు. అదే ఎన్నికల్లో గెలిపించడం ’ అని ప్రశాంత్‌ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. గతంలో జేడీ-యూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు అందుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ను.. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే కారణంతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత సొంత వేదికతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌.. నితీశ్‌పై సూటి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో నితీశ్‌ సైతం పీకేకు కౌంటర్లు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు