బిహార్‌ అభివృద్ధి కోసమే బీజేపీతో దోస్తీ

6 Oct, 2020 18:06 IST|Sakshi

నితీష్‌ కుమార్‌

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-జేడీయూల మధ్య సీట్ల పంపకాలను మంగళవారం ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. జేడీయూ 122 స్ధానాల్లో పోటీచేయనుండగా, బీజేపీ 121 స్ధానాల్లో తలపడుతుందని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌ వెల్లడించారు. జేడీయూ కోటాలో ఏడు స్ధానాలను హెచ్‌ఏఎంకు అప్పగించామని, బీజేపీ తన కోటాలో కొన్ని స్ధానాలను వికాస్‌షీల్‌ ఇన్సాన్‌ పార్టీకి కేటాయిస్తుందని ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని నితీష్‌ పేర్కొన్నారు. బిహార్‌ అభివృద్ధి కోసమే బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, దీనిపై ఎలాంటి అపోహలు లేవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బిహార్‌ తదుపరి సీఎంగా మళ్లీ నితీష్‌ కుమార్‌ పాలనా పగ్గాలు చేపడతారని బిహార్‌ బీజేపీ చీఫ్‌ సుశీల్‌ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ఎల్జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ చేసిన ప్రకటనను సుశీల్‌ మోదీ తోసిపుచ్చారు. ఆయన తండ్రి, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ క్రియాశీలకంగా ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పుకొచ్చారు. పాశ్వాన్‌కు ఇటీవల గుండె ఆపరేషన్‌ జరగడంతో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక బిహార్‌లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమిగా బరిలో దిగిన ఆర్జేడీ 144, కాంగ్రెస్ ‌70, సీపీఐఎంఎల్‌ 19, సీపీఎం 4 చోట్ల పోటీచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.  బిహార్‌ అసెంబ్లీకి మూడువిడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 3న రెండో విడత, నవంబర్‌ 7న మూడో విడత పోలింగ్‌ అనంతరం నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీట్ల పంపకాలు కొలిక్కిరావడంతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు వేడెక్కించనున్నాయి. చదవండి : నితీష్‌కు చెక్‌

మరిన్ని వార్తలు