‘సీఎం అక్రమ సంతానం’: రెండు రోజులు నిషేధం

1 Apr, 2021 15:50 IST|Sakshi

చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు పళని స్వామిపై ‘అక్రమ సంతానం’ అని చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ ఎ.రాజాపై మండిపడింది. ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రచారం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎ.రాజ రెండు రోజుల పాటు ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు.

డీఎంకే అధినేత స్టాలిన్‌ గొప్పతనం చేస్తూ సీఎం పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని చెపాక్‌లో  జరిగిన ప్రచారంలో రాజా ఆరోపించారు. ప్రీమెచ్చుర్‌గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్‌ నరేంద్ర మోదీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకులు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించి అతడి వివరణ గురువారం తీసుకుంది. ఆ వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం డీఎంకే స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న రాజాను తొలగించడంతోపాటు రెండు రోజుల పాటు ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది. రాజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉండడంతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు కిందకు వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు రాజాకు ఆ శిక్ష విధించింది. 

మరిన్ని వార్తలు