మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు.. అయితే..

27 Mar, 2021 04:55 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న విజయభాస్కర్‌

రాష్ట్రంలో కరోనా సెకెండ్‌ వేవ్‌ లేదు 

ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ స్పష్టీకరణ 

45 ఏళ్లు దాటిన వారికి ఏప్రిల్‌ 1 నుంచి కరోనా వ్యాక్సిన్‌ 

రాష్ట్రవ్యాప్తంగా 5వేల వ్యాక్సిన్‌ కేంద్రాలు

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు అధికం అవుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ అన్నారు. గత ఏడాది వంటి భీతావహ పరిస్థితులు, సెకెండ్‌ వేవ్‌ లేనందున మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించబోమని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరగడం, లాక్‌డౌన్‌ విధింపు ఖాయమని జరుగుతున్న ప్రచారంపై శుక్రవారం ఆయన మీడియా ముందు స్పందించారు. కరోనా ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా విద్యాసంస్థలను మూసివేసింది. జన సంచారాన్ని కూడా అదుపుచేయడం అవసరం. కరోనాకు సరైన మందులేకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ అనివార్యమైంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినందున లాక్‌డౌన్‌ అవసరం లేదు. అయితే ప్రజలు మాస్క్‌ ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధాకరం. ఎన్నికల ప్రచారంలో మాస్క్‌పై కూడా హెచ్చరిస్తున్నాను. కరో నా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.  

5వేల వ్యాక్సిన్‌ కేంద్రాలు సిద్ధం..                    
45 ఏళ్లకు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసామని తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి.  కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా ప్రజల సహ కారం మరింత అవసరం. మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల వేగంగా ఉంది. తమిళనాడులో అంతటి వేగం లేకున్నా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు వహించడం తప్పనిసరి. మాస్క్‌ ధరించకుండా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లడం వల్లనే వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నా అదృష్టవశాత్తు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.

తొలి దశలో 60 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్‌ పరిమితం చేసినా ఆ ఆంక్షలు సడలించి బీపీ, షుగర్‌ అనారోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఎలాంటి రుగ్మతలు లేకున్నా 45 ఏళ్లు దాటితే చాలు ఈనెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ వేస్తామని చెప్పారు. కరోనా లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించు కోవడంతోపాటు వ్యాక్సిన్‌ వేసుకుంటేనే వైరస్‌ను అదుపుచేయగలం. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రయివేటు ఆస్పత్రులు, మండల కార్యాలయాల్లో మొత్తం 5వేల వ్యాక్సిన్‌ కేంద్రాలను సిద్ధం చేసాం. కరోనా ఆంక్షలు పాటించని 61,246 మంది నుంచి మార్చి 16వ తేదీ మొదలు శుక్రవారం వరకు 1.31 కోట్ల జరిమానా వసూలు చేశాం. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ప్రజలు మాస్కులు ధరించక పోవడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. 

తల్లిదండ్రుల అయోమయం.. 
కరోనా వైరస్‌ మళ్లీ ప్రబలడం విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలో పడేసింది. 2021–22 విద్యా సంవత్సరంలో బడులు, కాలేజీలు యథాప్రకారం పనిచేస్తాయా లేదా అనేది స్పష్టం కాలేదు. తెరిచిన విద్యాసంస్థలను ఇటీవల మూసివేసారు. మరి ఈ తరుణంలో ఫీజలు కట్టడమా, మానడమా అనే సందేహంతో సతమతం అవుతున్నారు. గత ఏడాది పరిస్థితి పునరావృతమైతే ఫీజుల రూపంలో వేలాది రూపాయలను నష్టపోవాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు