జల విలయం : 170 మంది మృతిచెందినట్లేనా?

8 Feb, 2021 08:51 IST|Sakshi

లభ్యంకాని 170 మంది అచూకీ

ఇప్పటి వరకు 10 మృతదేహాలు వెలికితీత

డెహ్రాడూన్‌ : ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్‌ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయం ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం, కొంతమంది తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన శవాలుగా మిగిలిపోవడం కలవరానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఇతర సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేసినప్పటికీ వారి అచూకీ లభ్యంకాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయిన 170 మంది మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల్లో జల్లెడపడుతున్నా కొద్దీ శవాలు బయపడుతున్నాయి. ఇప్పటి వరకు 10 శవాలను గుర్తించగా.. మొత్తం 16 మందిని సహాయ బృందాలు కాపాడగలిగాయి. (ఉత్తరాఖండ్‌లో జల విలయం)

దీనిపై సోమవారం స్పందించిన ముఖ్యమంత్రి  త్రివేంద్ర సింగ్‌ రావత్.. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందన్నారు. రెండో తపోవన్ టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అయితే వారి అచూకీ లభించకపోవడం ఆందోళక కలిగిస్తోందన్నారు. మంచుకొండ విరిగిపడటంతో ఆదివారం అర్థరాత్రి మరోసారి ధౌలిగంగా పరివాహా ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో అలకనంద, ధౌలీగంగ, రుషిగంగ నదీ ప్రాంతాల్లో విపత్తు సంభవించింది. వరద ఉధృతి భారీగా పెరగడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

ధౌలిగంగకు వరదతో రుషిగంగలో పెరిగిన నీటి ప్రవాహం భారీగా పెరిగింది. నది ఉధృతికి తీరగ్రామాల్లో చాలావరకు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో నది తీరప్రాంతాల గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు ధైలిగంగా ఉధృతితో గంగానదీ తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఉత్తరాఖండ్‌, గంగానదీ తీర ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరాతీశారు. ఎప్పటికప్పుడు అక్కడి అధికారులను సంప్రదిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో యావత్‌దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదలో కొట్టుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు