చనిపోయిన రైతులకు సాయం చేయలేం: కేంద్రం

1 Dec, 2021 18:00 IST|Sakshi
రైతుల ఆందోళన (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదిగా కొనసాగుతున్న ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంత మంది రైతులు చనిపోయారనే  వివరాలు తమ వద్ద లేవని పార్లమెంట్‌కు తెలిపింది. 

ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదన ఏమైనా ఉందా అని లోక్‌సభలో ప్రభుత్వాన్ని బుధవారం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ‘ఉద్యమంలో చనిపోయిన అన్నదాతలకు సంబంధించి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద ఎటువంటి రికార్డు లేదు. అందువల్ల ఆర్థిక సహాయం అన్న ప్రశ్నే తలెత్తదు’ అని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని, కనీస మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర సర్కారు పునరుద్ఘాటించింది. (చదవండి: రేషన్‌ షాపుల్లో మినీ ఎల్‌పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన)

కాగా, ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. (మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!)

మరిన్ని వార్తలు