శశికళ ముందస్తు విడుదల లేదు

23 Sep, 2020 06:44 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లు శశికళ ముందుగానే విడుదల కాబోరని తేలిపోయింది. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న తరువాతనే వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విముక్తి లభిస్తుందని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది. 

సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా రుజువైంది. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది నాలుగేళ్లు పూర్తయి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది ఆఖరులో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో శశికళ విడుదలపై బెంగళూరుకు చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. చదవండి: (రియాకు రిమాండ్‌ పొడిగింపు)

వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ విడుదలయ్యే అవకాశం ఉందని జైళ్లశాఖ అతడికి బదులిచ్చింది. శశికళకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో విడుదలవుతారని ఆమె అనుచరులు ఇంకా ఆశాభావం వ్యక్తంచేస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు çసమీపిస్తున్న తరుణంలో శశికళ ముందస్తు విడుదల ఈ విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మరో సమాచారం బయటకు వచ్చింది. చదవండి: (తెరపైకి దియా, నమ్రత!)

ఈ పరిస్థితిలో సామాజిక కార్యకర్త టీ నరశింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద జైళ్లశాఖపై మరో ఉత్తరాన్ని సంధించారు. ఖైదీలకు ఇచ్చే సెలవు దినాలు, ఇలాంటి సెలవులు ఏఏ కేటగిరి ఖైదీలకు వర్తిస్తాయి, ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు వర్తిస్తుందా అని అందులో ప్రశ్నించారు. ఇందుకు జైళ్లశాఖ బధులిస్తూ...జీవితాంతం జైలుశిక్ష పడిన ఖైదీలకు మాత్రమే సెలవు దినాలు వర్తిస్తాయని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష అనుభవించేవారికి వర్తించదని స్పష్టం చేసింది. 

చిన్నమ్మ కోసం సైకిల్‌ యాత్ర 
నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు సమీపంలో మాంగుటైపాళయంకు చెందిన వడివేల్‌ (50) అనే వ్యక్తి అమ్మమక ఎంజీఆర్‌ మన్రం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకెళ్లి శశికళను కలుసుకునేందుకు ఈనెల 18న సైకిల్‌ యాత్రను ప్రారంభించాడు. రోజుకు 45 కి.మీ పయనిస్తూ సోమవారం రాత్రి హోసూరుకు చేరుకున్నాడు. శశికళతో ములాఖత్‌ కోసం జైలు అధికారులకు వినతపత్రం ఇస్తానని.. అనుమతి లభించిన పక్షంలో..‘మీరు వస్తేనే పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడగలరు, ప్రజలు మీకోసం ఎదురుచూస్తున్నారు’ అని చెబుతానని మీడియాతో అన్నారు.

మరిన్ని వార్తలు