ఆర్యన్‌ కుట్ర చేశారనడానికి ఆధారాల్లేవ్‌

21 Nov, 2021 06:42 IST|Sakshi

వాట్సాప్‌ సంభాషణల్లో అభ్యంతరకర అంశాలు లేవు 

బెయిల్‌ తీర్పు పూర్తి ప్రతిలో బాంబే హైకోర్టు

ముంబై: ముంబైలో క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం కేసులో అరెస్ట్‌ అయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ నేరానికి సంబంధించి ముందస్తు కుట్ర పన్నాడనడానికి ప్రాథమిక ఆధారాలు లభించలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్యన్‌ఖాన్, సహ నిందితులైన అర్బాజ్‌ మర్చంట్, మున్‌మున్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసినప్పుడు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని బాంబే హైకోర్టు శనివారం విడుదల చేసింది. డ్రగ్స్‌ కేసులో జడ్జి జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ. సాంబ్రే అక్టోబర్‌ 28న నిందితులందరికీ బెయిల్‌ మంజూరు ఇచ్చారు.

ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో లింకులున్నాయని అతని వాట్సాప్‌ చాట్‌ల ద్వారా తెలుస్తోందని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఆర్యన్‌ వాట్సాప్‌ సంభాషణల్లో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని జడ్జి తీర్పులో స్పష్టం చేశారు.  అధికారులు రికార్డు చేసిన ఆర్యన్‌ నేరాంగీకారాన్ని  విచారణ కోసమే వినియోగించాలన్నారు. ఎన్‌డీపీసీ చట్టం కింద అతను నేరం చేశాడని చెప్పలేమని జడ్జి పేర్కొన్నారు. ఆర్యన్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చెప్పడానికి తగిన ఆధారాలులేవని వెల్లడించారు. ఆర్యన్, అర్బాజ్, మున్‌మున్‌ కుట్ర చేశారని చెప్పడానికి ఎన్‌సీబీకి ఆధారాలు లభించలేదని ఆ తీర్పులో వివరించారు.

మరిన్ని వార్తలు