భారత్‌లో కొత్త వేరియంట్‌పై ఆధారాల్లేవు

24 Sep, 2021 17:12 IST|Sakshi

కొన్ని రాష్ట్రాల్లో ప్రబలంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

ఇన్సాకాగ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌(సార్స్‌–కోవ్‌2) కొత్త వేరియంట్‌ ఉనికిపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని జినోమ్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం ‘ఇన్సాకాగ్‌’ ప్రకటించింది. డెల్టా ఉప వేరియంట్లకు సంబంధించి అదనంగా సూచించాల్సిన జాగ్రత్తలు కూడా లేవని తెలిపింది. ఈ మేరకు తాజాగా బులెటిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ భారత్‌లో ఆందోళనకరమైన వేరియంట్‌గా(వీఓసీ) కొనసాగుతోందని వెల్లడించింది. డెల్టా కారణంగానే దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉధృతి కనిపించిందని, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ ప్రబలంగానే వ్యాప్తి చెందుతోందని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జూన్‌లో బయటపడిన ఏవై.1 వేరియంట్‌ నెమ్మదిగా, స్థిరంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్‌ వివరించింది. ఇక డెల్టాలో ఉపరకమైన ఏవై.4 వేరియంట్‌ లక్షణాలు బి.1.617.2 వేరియంట్‌ తరహాలోనే ఉన్నట్లు మహారాష్ట్రలో చేపట్టిన ప్రాథమిక అధ్యయనంలో తేలిందని పేర్కొంది. కరోనాలో కొత్త రకాలైన మూ(ఎంయూ), సి.1.2 వేరియంట్ల జాడ భారత్‌లో ఇప్పటిదాకా కనిపించలేదని ఇన్సాకాగ్‌ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు