ఢిల్లీ లాక్‌డౌన్‌ : మనీష్‌ సిసోడియా స్పందన

18 Nov, 2020 14:19 IST|Sakshi

ఢిల్లీ లాక్‌డౌన్‌ : మనీష్‌ సిసోడియా,  సత్యేంద్ర జైన్ స్పందన

 లాక్‌డౌన్‌ లేదు, కానీ ఆంక్షలుంటాయి

 సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ  విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం  మరోసారి ఆంక్షలు విధించింది. లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయన్న ఊహగానాలు వ్యాప్తిస్తున్నతరుణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే అవకాశంలేదని స్పష్టం చేశారు. అయితే  ఒకే ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకుండా ఉండాలని సూచించారు. అలాగే వివాహ అతిధుల సంఖ్యను 50 మందికి పరిమితం చేసినట్టు తెలిపారు. ఇకపై గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (అంతకుముందు ఇది 200గా ఉంది) ఇందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లభించినట్టు వెల్లడించారు.

దేశ రాజధానిలో ప్రస్తుతం మూడో దశ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. అటులాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదంటూ ఈ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్.  కానీ ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం చాలా హానికరమని, అందుకే దీన్ని నివారించాలని సూచించారు. కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌పరిష్కారం కాదని తాము నమ్ముతున్నామన్నారు. ఈ మేరకు దుకాణదారులు భయ పడాల్సిన అసరం లేదంటూ సత్యేంద్ర జైన్ భరోసా ఇచ్చారు. షాపులు తెరుచుకోవచ్చుగానీ, నిబంధనలు పాటించాలన్నారు. అలాగే ఛత్‌ పూజా సందర్బంగా పెద్ద ఎత్తున జనాలు ఒకే చోట చేరితే వైరస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది అందకే  ఆంక్షలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. (ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌?)

ఛత్‌ పూజ - ఆంక్షలు
కరోనావైరస్ కేసులు పెరుగుతున్నందున బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలను నిషేధించాలన్న ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయానికి జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీప్రభుత్వ నిర్ణయం ప్రజల మత విశ్వాసాలను ప్రభావితం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌ విచారించిన కోర్టు ఢిల్లీలో కరోనా పరిస్థితి గురించి తెలియదా... పూజలు చేయాలంటే మీరు సజీవంగా ఉండాలి కదా అని  పిటిషనర్‌నుద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు  కరోనారోగులకు  బెడ్స్‌,  పరీక్షా సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్రం బుధవారం పది మల్టీ డిసిప్లనరీ  బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి ఢిల్లీలోని 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి అంచనా వేయనున్నాయి. కాగా  కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే పలు మార్కెట్లను మూసివేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరివింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. దీంతో దేశరాజధాని మరో లాక్‌డౌన్‌  రానుందనే పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి  డిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.95 లక్షలను అధిగమించగా, దేశంలో 38,617 కొత్త కరోనావైరస్ కేసులతో  మొత్తం   సంఖ్య 89,12,907 కు చేరుకుంది. 

మరిన్ని వార్తలు