హే! హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట

20 Apr, 2021 03:29 IST|Sakshi

దేశంలో 60 శాతం మందికి పైగా కరోనా సోకిందంటున్న నిపుణులు

ఇంకా భారీగా నమోదవుతున్న కేసులు

60 శాతం మందికి సోకితే హెర్డ్‌ ఇమ్యూనిటీ అన్నది ఉత్త మాటే!

వందేళ్ల నాటి స్పానిష్‌ ఫ్లూ చెప్తున్న పాఠం ఇదే..

కోవిడ్‌ కట్టడి కోసం నాటి మహమ్మారిపై అధ్యయనం జరగాలని సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో 60 శాతం మందికి కోవిడ్‌ సోకితే ఇక హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఇక వైరస్‌ వ్యాప్తి తగ్గి క్రమంగా అంతర్థానం అవుతుంది’.. కోవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారంలో ఉన్న మాట ఇది.‘ఇప్పటికే హైదరాబాద్‌లో 54 శాతం మంది కోవిడ్‌ బారినపడ్డారు’.. కోవిడ్‌ తొలిదశ ముగిసిన సమయంలో సీసీఎంబీ చేసిన ప్రకటన ఇది. ఈ లెక్కన ఇప్పటికే హైదరాబాద్‌లో 60 శాతాన్ని మించి జనం ఇన్‌ఫెక్ట్‌ అయినట్టే. అంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చి, కరోనా వ్యాప్తి తగ్గిపోవాలి. కానీ వేలకొద్దీ కేసులు నమోదవుతున్నాయి. మరేమిటి విషయం అంటే.. ప్రచారంలో ఉన్నట్టుగా 60% మందికి సోకితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందన్నది ఉత్తమాటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకుంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు. వందేళ్ల కిం ద ప్రపంచాన్ని గడగడలాడించిన స్పానిష్‌ ఫ్లూ నాటి పరిస్థితిని, ఇటీవల స్వీడన్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీని ప్రయత్నించి దెబ్బతినడాన్ని గుర్తు చేస్తున్నారు.

అప్పుడు జరిగిందేమిటి?
పారిశ్రామిక విప్లవం వచ్చి ఆధునిక సమాజం మొదలైన తర్వాత వచ్చిన మహమ్మారి స్పానిష్‌ ఫ్లూ. మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తూనే దాని దాడి మొదలైంది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని స్వదేశాలకు వెళ్లిన సైనికులు ఈ వైరస్‌ను మోసుకెళ్లారు. తొలుత అమెరికాలో ఈ వైరస్‌ వెలుగు చూసినా.. ఆ దేశ సైని కులు యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక్కసారిగా ప్రబ లింది. దాని అసలు ప్రభావం స్పెయిన్‌ నుంచి మొదలైంది. దాంతో ఆ వైరస్‌కు స్పానిష్‌ ఇన్‌çఫ్లూ యెంజా పేరు పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బారినపడి దాదాపు మూడున్నర కోట్ల మంది చనిపోతే.. అందులో ఒక్క మన దేశంలోనే కోటిన్నర మంది చనిపోయినట్టు అంచనా. అంటే వైరస్‌ సోకినవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. అప్పటి జనాభా ప్రకారం చాలా మందికి వచ్చినట్టే. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని నిపుణులు ప్రస్తావనకు తెస్తున్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్మి దెబ్బతిన్న స్వీడన్‌..
కోవిడ్‌ వ్యాప్తితో ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోగా ఒక్క స్వీడన్‌ మాత్రం దానికి వ్యతిరేకంగా అడుగేసింది. ఆ దేశ ఎపిడమాలజిస్ట్‌ అండర్స్‌ టాగ్నెల్‌ ప్రభుత్వానికి హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్ముకోవాలని సూచించిన ఫలి తం అది. స్వీడన్‌లో కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం టాగ్నెల్‌ను కరోనా కంట్రోల్‌ యూనిట్‌ చీఫ్‌గా నియమించింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, హెర్డ్‌ ఇమ్యూనిటీ విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. దాంతో దుకాణాలు, బార్లు, మాల్స్, ప్రీస్కూల్స్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అన్నీ తెరిచే ఉంచారు. అక్కడే తేడా కొట్టింది. నిజానికి స్వీడన్‌ చిన్న ధనిక దేశం.. జనాభా కోటిన్నర మాత్రమే. పార్టీలు, వేడుకలు నిత్యకృత్యం. అయితే ఆ దేశ సగటు ఆయుర్ధాయం 86 ఏళ్లు. దాంతో వృద్ధుల సంఖ్య ఎక్కువ. 65 ఏళ్లపై వయసున్నవారు ఆ దేశ జనాభాలో దాదాపు 24 శాతం ఉన్నారు. ఇలాంటి క్రమంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ విధానం గట్టి దెబ్బకొట్టింది. కేసులు విపరీతంగా పెరిగిపోయి, ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ తొలి నాలుగు నెలల్లో 3,460 మంది కరోనాతో చనిపోతే.. అందులో 70 ఏళ్లు, ఆపై వయసున్న వారు 2,975 మంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో హెర్డ్‌ ఇమ్యూనిటీ యోచనకు మంగళం పలికి.. లాక్‌డౌన్‌ పెట్టారు.

జాగ్రత్తలు తెలియక..
ప్రస్తుతం కోవిడ్‌కు అడ్డుకట్ట వేయాలంటే మాస్కు లు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి నిబంధనలు అమలవుతున్నాయి. కానీ స్పానిష్‌ ఫ్లూ నాటి పరిస్థితి దీనికి కాస్త భిన్నం. మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తెలియవు. వైరస్‌ సోకి ఎవరైనా జ్వరం బారిన పడితే.. వారిని పరామర్శించేందుకు చుట్టుపక్కల జనాలు వచ్చేవారు. ఎవరైనా వైరస్‌తో చనిపోతే అంతిమ సంస్కారాలకు పెద్ద సంఖ్యలో గుమిగూడేవారు. దీంతో చూస్తూండగానే స్పానిష్‌ ఫ్లూ దేశం మొత్తం వ్యాపించింది. సరైన వైద్య వసతుల్లేక జనం విలవిల్లాడారు. కొన్ని ఊళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా వైరస్‌ దేశంలోని ప్రతి గడపనూ తట్టిందని.. ఓ అంచనా ప్రకారం దాదాపు 85 శాతం మంది ప్రజలకు ఫ్లూ సోకిందని నిపుణులు చెప్తున్నారు. మిగతావారిలో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉండటంతో దానిబారిన పడలేదు. అంటే 60 శాతం మందికి వైరస్‌ సోకితే హెర్డ్‌ (మూకుమ్మడి) ఇమ్యూనిటీ వచ్చి వైరస్‌ మాయమవుతుందన్న మాట సరికాదని అంటున్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీకి ఆధారం లేదు..
‘‘కోవిడ్‌ను కట్టడి చేసే క్రమంలో వందేళ్లనాటి స్పానిష్‌ ఫ్లూను అధ్యయనం చేయడం చాలా అవసరం. దానికి దీనికి చాలా పోలికలున్నాయి. ఆ వ్యాధితో ప్రపంచంలో బాగా దెబ్బతిన్న దేశం మనదే. ఇక్కడ దాదాపు కోటిన్నర మందిని స్పానిష్‌ ఫ్లూ పొట్టనపెట్టుకుంది. ప్రతి ఇంట్లో వైరస్‌ జాడ కనిపించింది. అప్పట్లో వైరస్‌ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన లేక, ఆధునిక వైద్యం లేక భారీగా మరణాలు సంభవించాయి. 60% మందికి సోకితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందన్న మాటకు నాటి ఉదంతంలో ఎక్కడా ఆధారాలు లేవు. అందువల్ల ఆ దిశగా యోచించకుండా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయడం, జనం నిబంధనలు పాటించేలా చేయడంపై దృష్టి పెట్టాలి. మ్యుటేషన్స్‌ వల్ల వ్యాక్సిన్ల పనితనం ఎంతనే విషయంలోనూ పరిశోధనలు సాగాలి.’’
- డాక్టర్‌ రాజారెడ్డి, ప్రముఖ న్యూరో సర్జన్‌

మరిన్ని వార్తలు