పిల్లలపై... థర్డ్‌వేవ్‌ ప్రభావానికి ఆధారాల్లేవ్‌!

13 Jun, 2021 03:31 IST|Sakshi

లాన్సెట్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేందుకు ఇంతవరకు సరైన ఆధారాల్లేవని లాన్సెట్‌ కోవిడ్‌–19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌ నివేదిక తేల్చిచెప్పింది. ‘భారతీయ పిల్లల్లో కోవిడ్‌ 19’ అనే అంశంపై పరిశోధన జరిపేందుకు లాన్సెట్‌ ఇండియా సంస్థ ఎయిమ్స్‌లోని ప్రముఖ పీడియాట్రిషన్ల్ల(చిన్నపిల్లల వైద్య నిపుణులు)తో  కూడిన ఒక బృందాన్ని ఏర్పరిచింది. ఈ బృందం పిల్లలలో థర్డ్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేందుకు ఆధారాలేమీ లభించలేదని వివరించింది. ‘కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమంది ఎలాంటి లక్షణాలను కనబరచరు(ఎసింప్టమాటిక్‌), మిగిలినవారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో అధికులు స్వల్ప జ్వరం, శ్వాస సమస్యలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. వయసులవారీగా చూస్తే లక్షణాలు చూపే పిల్లల సంఖ్య వయసు పెరిగేకొద్దీ పెరుగుతుంది’అని బృంద నివేదిక తెలిపింది.  

లక్షలో ఒక్కరు..
అధ్యయన వివరాలను అనువర్తిస్తే లక్షమంది పిల్లల్లో కేవలం 500 మంది మాత్రమే ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 2 శాతం మంది మాత్రమే మరణించడం జరిగింది. ‘లక్ష మంది పిల్లల్లో కోవిడ్‌ మరణాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి’ అని బృందం సభ్యుడు డాక్టర్‌ సుశీల్‌ కాబ్రా చెప్పారు. ‘ గణాంకాల ప్రకారం చూస్తే కరోనా థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువని కానీ, పిల్లలు తీవ్ర అనారోగ్యం పాలవుతారనేందుకు కానీ సరైన ఆధారాలేవీ లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువ, మరణాల రేటు కూడా తక్కువే’ అని వివరించారు. ఒబేసిటీ, ఆస్థమా, శ్వాస సమస్యలు, పెరుగుదల సమస్యలు, గుండె సమస్యలు, కాన్సర్, ఇమ్యునిటీ వ్యాధులు రిస్కు కారకాలని నివేదిక తెలిపింది. అలాగే తీవ్రత తక్కువని నిర్లక్ష్యం చేయకుండా, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి మౌలిక వసతులు పెంచడం, ఆక్సీజన్‌ సరఫరా అంతరాయం లేకుండా చూసుకోవడం, మందుల కొరత నివారించడం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది.

మరిన్ని వార్తలు