లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన

8 Apr, 2021 20:49 IST|Sakshi

ఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేయాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 11 నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా వ్యాప్తి విజృంభనతో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడి రాష్ట్రాల వారీగా వివరాలు తెలుసుకున్నారు.

కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎంలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ కంటే ఎక్కువ తీవ్రత ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందని గుర్తుచేశారు. వ్యాక్సినేషన్‌ కన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ల సంఖ్యను భారీగా పెంచాలని, అందరూ తప్పనిసరిగా కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని పేర్కొన్నారు. 

కోవిడ్‌పై పోరాటానికి మళ్లీ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రులకు తెలిపారు. ఫస్ట్‌ వేవ్‌ను జయించాం.. సెకండ్‌ వేవ్‌ను కూడా జయించగలం అని స్పష్టం చేశారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యం చెప్పారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఒక ప్రత్యామ్నాయం అని తెలిపారు. 45 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు