Omicron Variant: కొత్త వేరియంట్‌ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్‌డౌన్‌: ఆరోగ్యమంత్రి 

30 Nov, 2021 07:39 IST|Sakshi

సర్కారు మల్లగుల్లాలు  

నేడు మరిన్ని నిబంధనల జారీ?

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రవేశించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా కట్టడి చేయాలా.. అని తర్జనభర్జనలు పడుతోంది. సరిహద్దుల్లో తనిఖీలను పెంచింది, మరోవైపు విద్యాలయాల్లో కరోనా పంజా విసురుతుండడంతో అక్కడ సదస్సులు, సాంస్కృతిక వేడుకలను నిషేధించింది. విద్యార్థులు, వైద్య సిబ్బందికి నిత్యం కరోనా పరీక్షలు చేయాలని, పాజిటివ్‌ తేలిన వారిని క్వారంటైన్‌కు పంపించాలని ఆదేశించింది. కరోనా సాంకేతిక సమితి, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు మంగళవారం సమావేశమై మరిన్ని నిబంధనలు విడుదల చేసే అవకాశం ఉంది.  

అసెంబ్లీ సమావేశాలపై సస్పెన్స్‌ 
వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. ఈసారి బెళగావి సువర్ణసౌధలో డిసెంబరు 13 నుంచి 24వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని నిర్ణయమైంది. ఒమిక్రాన్‌ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తారా? లేదా? అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. ఇక క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలపైనా మంగళవారం ప్రకటన చేసే అవకాశముంది.

థర్డ్‌ వేవ్‌ రాకుండా చర్యలు: సీఎం 
తుమకూరు: మహమ్మారి కరోనా వైరస్‌ మూడవ దశ రాకుండా రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం బసవరాజు బొమ్మై చెప్పారు. సోమవారం తుమకూరు  శ్రీ సిద్దగంగా మఠంలో శివకుమార స్వామీజీ సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా కొన్ని చోట్ల కేసులు వస్తున్నాయని, వాటిని కట్టడి చేయడంతో పాటు ఒమిక్రాన్‌ రకం రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆరోగ్య శాఖాధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. విదేశాల నుంచి విమానాల్లో వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే కేరళ నుంచి వచ్చేవారికి టెస్టులను తప్పనిసరి చేశామన్నారు.  

చదవండి: (‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌ కథాకమామిషూ)

హాస్టల్‌లో కరోనా కలకలం
బనశంకరి: హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా రెసిడెన్షియల్‌ స్కూల్‌ హాస్టల్‌లో 13 మంది హైస్కూల్‌ విద్యార్థులకు కరోనా సోకింది. సోమవారం ఆరోగ్య శాఖ సిబ్బంది పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో  ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

నో లాక్‌డౌన్‌: ఆరోగ్యమంత్రి 
దొడ్డబళ్లాపురం/ చిక్కబళ్లాపురం: ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ని అడ్డుకోవడానికి మళ్లీ లాక్‌డౌన్‌ను విధించాలనే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని  ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో రెండు సార్లు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఉద్యోగాలు పోగొట్టుకుని, జీవనోపాధి కరువై ఇప్పటికీ  కోలుకోలేకపోతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో లాక్‌డౌన్‌ విధించడం సమంజసం కాదన్నారు. కొందరు కావాలనే సోషల్‌ మీడియాలో లాక్‌డౌన్‌ అని ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెల్టా వైరస్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ లక్షణాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియదన్నారు. ప్రజలు కోవిడ్‌ నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెల్టా కంటే ఇది ప్రమాదకరం కాదని అన్నారు. ప్రజలు గుంపులుగా చేరరాదని, సాంస్కృతిక కార్యక్రమాలను జరపరాదని కోరారు. 

>
మరిన్ని వార్తలు