న్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం?

26 Aug, 2020 16:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నేత్రికన్‌ తిరప్పినమ్, కుట్రమ్‌ కుట్రమే’ అన్న తమిళ వ్యాక్యానికి ‘శివుడు మూడో కన్ను తెరిచినాసరే, తప్పు తప్పే’ అని అర్థం. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తనపై దాఖలైన ‘కోర్టు ధిక్కార నేరం’ కేసులో దాదాపు ఇదే అర్థంలో వాదించారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డావని సుప్రీం కోర్టు తేల్చినా, శిక్ష పడుతుందని హెచ్చరించినా ప్రశాంత్‌ భూషణ తన మాటలకే కట్టుబడి ఉన్నారు. కోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలు సబబేనని పునరుద్ఘాటించారు.

అత్యున్నత న్యాయవ్యవస్థ పనితీరు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అవడం, దీనిపై స్వయంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనపై కోర్టు ధిక్కార నేరం మోపడం తెల్సిందే. భూషణ్‌ నేరం చేసినట్లు గత వారమే నిర్ధారించిన సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించేందుకు మంగళవారం నాడోసారి కొలువుదీరింది. క్షమాపణలకు అవకాశం ఇచ్చినప్పటికీ భూషణ్‌ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనకు కోర్టు ఏ శిక్ష విధించినా అది ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుందే తప్పా, తగ్గించేదేమీ లేదు.

భూషణ్‌ ధిక్కారం కేసులో కోర్టు వ్యవహారం ‘గోరుతో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్న’ చందంగా మారింది. కోర్టు పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను విమర్శిస్తూ భూషణ్‌ చేసిన ట్వీట్లు అస్పష్టంగానే ఉన్నాయి. కానీ తనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసుకు సమాధానంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో కోర్టు వ్యవహరించిన తీరును సమూలంగా వివరించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన బిల్లు, కశ్మీర్‌లో పౌరసత్వ హక్కుల పునరుద్ధణకు సంబంధించిన కేసుల్లో కోర్టు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. అయోధ్య–రామ జన్మభూమి కేసులో గొగొయ్‌ ఇచ్చిన తీర్పును సైతం ఆయన వదిలిపెట్టలేదు. (క్షమాపణ కోరితే తప్పేముంది)

అంతేకాకుండా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌కి వ్యతిరేకంగా దాఖలైన లైంగిక వేధింపుల కేసులో కోర్టు వ్యవహరించిన తీరును, గొగొయ్‌ పదవీ విరమణ తర్వాత ఆ కేసును దాఖలు చేసిన యువతికి కోర్టులో మళ్లీ అదే పోస్ట్‌ ఇవ్వడం లాంటి పరిణామాలను భూషణ్‌ కూలంకుషంగా ప్రస్తావిస్తూ వాటిపై తన అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించారు. బిర్లా–సహారా కేసు నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కాలిఖోపాల్‌ ఆత్మహత్య నోట్‌లో చేసిన ఆరోపణల వరకు ప్రశాంత్‌ భూషణ్‌ ప్రస్తావించారు. మాజీ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను విధులు నిర్వహించకుండా కేంద్రం అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన గత నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పులనే ఎక్కువగా ప్రస్థావించారు. దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ అనేక కేసుల్లో అనేక సార్లు తీర్పు చెప్పిన మన న్యాయ వ్యవస్థ తన విషయంలో మాత్రం ఎందుకు ‘ధిక్కారం’ అంటుందో...!!

>
మరిన్ని వార్తలు