ఎన్‌ఈపీ 2020: చైనీస్‌ భాషపై సందిగ్దత!

1 Aug, 2020 16:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కు కేంద్ర కేబినెట్‌ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక  కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్) 

అదే విధంగా ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు  ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని,  6–8 గ్రేడ్‌ ల మధ్య ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చని పేర్కొంది. అయితే గతేడాది విదేశీ భాషల విభాగంలో ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, జపనీస్‌, చైనీస్‌ భాషలను ముసాయిదాలో పేర్కొన్న కేంద్రం.. బుధవారం నాటి కేబినెట్‌ నిర్ణయంలో మాత్రం చైనీస్‌ భాష గురించి ప్రస్తావన తీసురాలేదు. అంతేగాక ఈ ఏడాది కొత్తగా కొరియన్‌, రష్యన్‌, పోర్చుగీస్‌, థాయ్‌ భాషలను ఈ జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో తాజా లిస్టు నుంచి చైనీస్‌(మాండరిన్‌)ను మినహాయించిన క్రమంలో ఈ భాషను నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం ఉందా లేదా అన్న విషయంలో సందిగ్దత నెలకొంది. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు)

మరోవైపు.. సరిహద్దుల్లో చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఉద్దేశపూర్వంగా చైనీస్‌ను పక్కన బెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా గల్వాన్‌ లోయలో జూన్‌లో చైనా ఆర్మీ భారత సైన్యాన్ని దొంగ దెబ్బ కొట్టి  20 మంది సైనికుల ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్నా డ్రాగన్‌ తన వైఖరి మార్చుకోకపోవడంతో భారత్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. చైనీస్‌ యాప్‌లతో జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి జూన్‌ 29న టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. ఇటీవల మరో 47 యాప్‌లపై సైతం నిషేధం విధించింది. ఇక బుధవారం ప్రకటించిన నూతన విద్యావిధానంలో చైనీస్‌ భాషను మినహాయించడంపై కూడా ఉద్రిక్తతల ప్రభావం పడినట్లు కనబడుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా