ప్రభుత్వం ఏర్పడి 36 రోజులు.. ఇప్పటివరకు నోచుకోని మంత్రివర్గ విస్తరణ

7 Aug, 2022 07:30 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి 36 రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఫలితంగా మంత్రులు లేక వివిధ శాఖల్లో పనులు స్తంభించిపోతున్నాయి. దీంతో పనులు పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఏక్‌నాథ్‌ శిందే దృష్టి సారించారు. అందులో భాగంగా మంత్రాలయలో ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులకు మంత్రుల బాధ్యతలు అప్పగించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు.

ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ జూన్‌ 30న ప్రమాణస్వీకారం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ఎప్పుడెప్పుడా అని కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కాగా మంత్రుల వద్ద అనేక రకాల అధికారాలుంటాయి. కాని రాష్ట్రంలో మంత్రులే లేరు. దీంతో వివిధ శాఖల పనులు పెండింగులో పడిపోయాయి. వివిధ కేసుల్లో కోర్టులో అపీల్‌ చేయడం, పునర్విచారణ, నిధుల విడుదలపై అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం, తుది జాబితా రూపొందించడం, అత్యవసర నిర్ణయాలు తీసుకోవడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఆయా శాఖల మంత్రుల వద్ద ఉంటాయి.

మంత్రుల సంతకాలు లేకపోవడంతో కీలకమైన ఫైళ్లు కూడా ముందుకు సాగడం లేదు. ఈ పనులన్నీ వేగంగా ముందుకు సాగాలంటే మంత్రులుండాలి. కానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో అధికారాలు ఎవరికివ్వాలనే అంశం తెరమీదకు వచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టేంత వరకు చీఫ్‌ సెక్రటరీ, అదనపు చీఫ్‌ సెక్రటరీలకు అధికారాలు ఇవ్వాలని ఏక్‌నాథ్‌ శిందే నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు ఈ అధికారాలు వారి వద్దే ఉంటాయని శిందే స్పష్టం చేశారు.  

స్తంభించిన కార్యకలాపాలు.. 
హోం, రెవెన్యూ, నగరాభివృద్ధి లాంటి కీలక శాఖల్లో అనేక కేసులు అపీల్‌ చేయలేక పెండింగులో ఉన్నాయి. ఆహార, పౌర, సరఫరాల శాఖ, ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ పరిపాలన శాఖ, గ్రామాభివృద్ధి, విద్యా తదితర శాఖలతో సామాన్య ప్రజలకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. అంతేగాకుండా సామాజిక సేవా సంస్ధలతో సంబంధం ఉన్న అప్పీల్‌లపై విచారణ జరుగుతూ ఉంటుంది. కానీ గత 36 రోజుల నుంచి ఈ అప్పీల్‌లపై విచారణ జరగలేదు. ఈ పనులు మంత్రులు లేకుండా ముందుకు వెళ్లలేవు. దీంతో మంత్రుల కారణంగా ఈ పనులు ఆగిపోకూడదని భావించిన శిందే కార్యదర్శులకు అధికారాలు ఇచ్చారు.

‘పంద్రాగస్టుకు ముందే మంత్రి వర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుంది. పంద్రాగస్టు రోజున మంత్రుల తమతమ నియోజకవర్గాలలో జాతీయ జెండాలు అవిష్కరిస్తారు’అని శిందే వర్గంలోని మాజీ మంత్రి ఉదయ్‌ సామంత్‌ తెలిపారు. తరుచూ వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఇప్పుడైన ముహూర్తం లభిస్తుందా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.  

‘మంత్రాలయ’గా సచివాలయ్‌ 
ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లో ఉన్న సచివాలయ్‌ భవనాన్ని ఇప్పుడు మంత్రాలయగా నామకరణం చేశారు. గతంలో ఈ భవనాన్ని సచివాలయ్‌గా పిలిచేవారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా శిందే, ఫడ్నవీస్‌ తీసుకుంటున్నారు. మంత్రులు లేకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే ఉంటున్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల వరదలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో బయట ప్రపంచంతో సంబం«ధాలు తెగిపోయాయి. మంత్రులు లేక బాధితులకు సా యం, పునరావాసం, పంటనష్టంపై పంచనామా త దితర పనులు సకాలంలో పూర్తికాలేకపోతున్నాయి. 

న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జాప్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి ప్రభావం పడలేదని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే శనివారం అన్నారు. మంత్రి మండలి విస్తరణలో మరికొంతమంది మంత్రులను త్వరలో చేర్చుకోనున్నామని చెప్పారు. జూన్‌ 30న మహారాష్ట్రలో ప్రభుత్వం మారినప్పటినుంచి మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందన్న ప్రశ్నలకు సమాధానంగా శిందే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన శ్రేణుల్లో తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేసిన తర్వాత జూన్‌ 30న శిందే పదవీ బాధ్యతలు చేపట్టారు.

శివసేన శ్రేణులలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన శిందే నేతృత్వంలోని బీజేపీ–మద్దతుగల ప్రభుత్వానికి ఆ పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ లేకపోవడం వల్ల రాష్ట్రంలో అన్నిరకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు ‘ప్రభుత్వ పనితీరు ఏ విధంగానూ ప్రభావితం కాలేదు. నిర్ణయ ప్రక్రియ సైతం ప్రభావితం కాలేదు. నేను, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంత్రులు లేనందువల్ల ఎటువంటి ప్రభావం లేదు’ అని శిందే ఇక్కడ విలేకరులతో అన్నారు.

కాగా, శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జాతీయ కమిటీ సమావేశానికి, ఆదివారం జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేందుకు షిండే దేశ రాజధానికి చేరుకున్నారు. ‘ఈ ఢిల్లీ పర్యటనకు మంత్రి మండలి విస్తరణతో సంబంధం లేదు’ అని శిందే స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి శిందే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మంత్రిమండలి విస్తరణకోసం సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచి ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు