అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు

24 Oct, 2020 08:25 IST|Sakshi

ఆర్మీ క్యాంటిన్లలో  విదేశీ అమ్మకాలకు చెక్?

విదేశీ మద్యం  కొనుగోళ్లు నిలిపివేత

రెండు దిగ్గజ బ్రాండ్లకు షాక్

సాక్షి,న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు తాజా నివేదికల సమాచారం. అంతేకాదు ఆర్మీ క్యాంటిన్లలో ఇకమీదట విదేశీ మద్యం అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన  స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే  విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలో ఆర్డర్  నిర్దిష్టంగా పేర్కొనలేదనీ అయితే, విదేశీ మద్యం కూడా జాబితాలో ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు  తిరస్కరించారు.  దీనికి సంబంధించి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  

మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు. కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది.  వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర  నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. 2 బిలియన్ డాలర్లకు పైగా వార్షిక అమ్మకాలతో,  భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్స్ లో ఒకటిగా క్యాంటీన్ స్టోర్స్  ఉన్నాయి.

మరిన్ని వార్తలు