గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు!

27 May, 2021 19:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ప్రయాణించేలా టోల్ ప్లాజా దగ్గర రద్దీ సమయంలో కూడా వాహనదారులకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు.

ఇలా లైన్ పొడవు 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్‌ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు అని కేంద్రం తెలిపింది. టోల్ ప్లాజా ఆపరేటర్లలో జవాబుదారీతనం తేవడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఫాస్టాగ్స్ తప్పనిసరి రూల్స్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వెంటనే వెళ్లిపోవచ్చు. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి. దీన్ని మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దేశంలో రాబోయే 10 సంవత్సరాలలో పెరగబోయే వాహనాల సంఖ్యకు అనుగుణంగా రాబోయే టోల్ ప్లాజాల డిజైన్ చేపట్టాలని కేంద్రం తెలిపింది.

చదవండి: 

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

మరిన్ని వార్తలు