నో పార్కింగ్‌.. నో కార్‌.. పోలీస్‌ కమిషనర్‌ ట్వీట్‌తో కలకలం

27 Mar, 2022 12:13 IST|Sakshi

ముంబై పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండే చేసిన ట్వీట్‌ ఒకటి వాహనదారుల్లో కలకలం సృష్టించింది. అనేకానేక చర్చలకు దారి తీసింది. ముంబై రహదారులపై విపరీతంగా పెరుగుతున్న వాహనాల నేపథ్యంలో, ‘పార్కింగ్‌ స్థలం లేని వ్యక్తులకు కార్లను అమ్మకూడదు.. అంటే నో పార్కింగ్, నో కార్‌ పద్ధతిని ముంబైలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..?’ అని సంజయ్‌ పాండే ట్వీట్‌ చేశారు. ముంబైలో ప్రతి రోజూ 600 కొత్త కార్లు నమోదవుతున్నాయనీ, వీటితో పాటు అసంఖ్యాక ట్యాక్సీలు, ఇతర వాహనాలు ఉన్నాయనీ, వీటన్నింటి వల్ల నగరంలో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడుతోందని, అందుకే ఏదో ఒక ఉపాయం చేయాల్సి ఉంటుందనీ, నో పార్కింగ్, నో కార్‌ పద్దతిని అమలుచేస్తే ఎలా ఉంటుందోనని యోచిస్తున్నామనీ ఆయన అన్నారు.

కాగా, పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ముంబైలో దాదాపు 80 శాతం ప్రజలు చాల్స్‌లో, మురికివాడల్లో నివాసముంటున్నారనీ, వారికి పార్కింగ్‌ స్థలం ఎక్కడి నుంచి వస్తుందనీ, సుమారు 40 శాతం వాహనాలు రోడ్ల పైనే పార్కింగ్‌ చేస్తారనీ, ప్రభుత్వమే చవక ధరల్లో పార్కింగ్‌ స్థలాలని పే అండ్‌ పార్క్‌ పద్ధతిలో ఏర్పాటు చేయాలనీ, అందుకోసం ప్రతి ప్రాంతంలో పార్కింగ్‌ భవనాల నిర్మాణం కొనసాగించాలనీ పలువురు సూచించారు.

ప్రత్యామ్నాయమార్గం చూడాలి.. 
మొబిలిటీ ఫోరంకు చెందిన అశోక్‌ దాతార్‌ మాట్లాడుతూ, ముంబైలో నో పార్కింగ్‌ నో కార్‌ పద్ధతి అమలు చేయడం అసాధ్యమనీ, వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ అన్నారు. నిజానికి నో పార్కింగ్‌ నో కార్‌ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. పార్కింగ్‌ సమస్య ఎంత పాతదో ఈ ప్రతిపాదన కూడా అంతే పాతది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన సర్కారీ ఫైళ్ళల్లో మగ్గుతోంది. కాగా, గత పది సంవత్సరాల్లో ముంబైలో 107 శాతం వాహనాల సంఖ్య పెరిగిందనీ, ఈ సంఖ్య భస్మాసుర హస్తంగా మారక ముందే ఏదో ఒకటి చేయాలనీ, పోలీస్‌ కమీషనర్‌ సంజయ్‌ పాండే అభిప్రాయపడ్డారు.

ఇది నా వ్యక్తిగత అభిప్రాయమనీ, నేను కూడా ఒక ముంబైకర్‌నే అని, నేను రోడ్‌పై సౌకర్యవంతంగా కారు నడిపించాలని కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఒక కిలోమీటర్‌ పరిధిలో 2,100 వాహనాలున్నాయి. గత పది సంవత్సరాల్లో 107 శాతం వాహనాలు పెరిగాయి. కార్ల సంఖ్య 92 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 121 శాతం పెరిగాయి. వాహనాల రద్దీని అరికట్టేందుకు గతంలో  కూడా పలు సూచనలు వచ్చాయి.

అందులో 1. నో పార్కింగ్‌ నో కార్‌ పద్ధతి 2. రెండవ కారుపై అధికంగా రోడ్‌ ట్యాక్స్‌ విధించడం, 3. కారు యజమానులపై అధికంగా ఇంధన ట్యాక్స్‌ విధించడం, 4. మార్కెట్‌ ప్రాంతంలో పార్కింగ్‌ రేట్లను బాగా పెంచడం. కానీ ఈ సూచనలేవీ ఇంతవరకు అమలులోకి రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు