కరోనా విజృంభణ; లాక్‌డౌన్‌కు సీఎం విముఖత

3 Apr, 2021 02:02 IST|Sakshi
మెట్రో రైలులో మాస్క్‌ ధరించని ప్రయాణికులకు జరిమానా విధిస్తున్న ఢిల్లీ మెట్రో సిబ్బంది 

ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌ 

రెట్టింపులో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

మాస్క్‌ ధరించకపోతే రూ.2 వేలు జరిమానా 

ఢిల్లీ మెట్రోలో 529 మందికి జరిమానా 

సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెట్టింపు స్థాయిలో మరోసారి సంక్రమిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షా సమావేశాలు నిర్వహించాయి. శుక్రవారం మహారాష్ట్ర, ఢిల్లీ , ఉత్తరప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతస్థాయి అధికారులతో తాజా పరిస్థితులపై చర్చించారు. కరోనా కట్టడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం ఎ.కేజ్రీవాల్‌ సమీక్ష జరిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మాస్క్‌లు ధరించడంపై కొనసాగుతున్న జరిమానాల అంశంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ సరిగ్గా ధరించని వారికి విధిస్తున్న రూ.2వేల జరిమానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ విధించేందుకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విముఖత ప్రదర్శించారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన ఏదీ లేదని ఆయన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ప్రకటించారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని కేజ్రీవాల్‌ తెలిపారు. 24 గంటల్లో 3,583 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇది కరోనా సంక్రమణలో నాలుగోదశ అని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించామని కేజ్రీవాల్‌ ప్రకటించారు.  చదవండి: (లాక్‌డౌన్ హెచ్చరికలు.. సొంతూళ్లకు కూలీలు)

45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా రాష్ట్రప్రభుత్వాలకు అనుమతి ఇస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని, సంక్రమణను ఆపవచ్చని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు ఏప్రిల్‌ 1వ తేదీన ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన వారిలో మాస్క్‌ ధరించని, సామాజిక దూరాన్ని పాటించని 529 మందికి రూ.2 వేల చొప్పున అధికారులు జరిమానా విధించారు.  

చదవండి: (భయపెట్టిస్తున్న లాక్‌డౌన్‌..)

మరిన్ని వార్తలు