Congress High Command: తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపు.. ఈ సారైనా న్యాయం చేస్తారా?

30 Oct, 2022 15:32 IST|Sakshi

ఖర్గే కూడా మొండిచేయే చూపించారా?
కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలుగు ప్రజలంటే చిన్నచూపే అన్న విమర్శ దశాబ్దాలుగా ఉన్నదే. కీలకమైన వర్కింగ్ కమిటీలో కూడా అరకొర ప్రాధాన్యతే. కొత్త అధ్యక్షుడు వేసిన స్టీరింగ్‌ కమిటీలో కూడా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీడబ్ల్యూసీ ఏర్పాటులో అయినా న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

స్టీరింగ్‌ ఎటు వైపు తిరిగింది?
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. అన్ని కమిటీలు రద్దయి, కొత్తగా స్టీరింగ్ కమిటీ పేరుతో తాత్కాలిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో మాజీ ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి మినహా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులెవరికీ అవకాశం దక్కలేదు. కొత్త అధ్యక్షుడికి తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అందుక వీలుగానే ఏఐసీసీ, సీడబ్ల్యూసీలు రద్దయ్యాయి. పాత సీడబ్ల్యూసీ నుంచే కొత్తగా స్టీరింగ్‌ కమిటీ వేశారని, త్వరలోనే అన్ని కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. గతం నుంచి తెలుగు రాష్ట్రాల పట్ల చిన్నచూపే ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనూ అనేక విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్ హైకమాండ్‌. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత.. ఉన్నత స్థాయి కమిటీల్లో ఎప్పుడూ తెలుగువారికి చోటు ఉండదు. 

చేయి విదల్చేది కొందరికేనా?
తాత్కాలికమే అయినా స్టీరింగ్‌ కమిటీలో తెలుగు నాయకులకు చోటు లేకపోవడంపై చర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటూ... రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో పీవీ నరసింహరావు ప్రధానిగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, మల్లు అనంతరాములు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా తమ సమర్థత చూపించారు. ఆ తర్వాత ప్రధానకార్యదర్శి స్థాయి పదవికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ళ కాలంలో కూడా కేంద్ర కేబినెట్‌లో ముఖ్య పదవులేమీ ఇవ్వలేదు. కార్యదర్శి స్థాయి పదవులు మినహా కేంద్ర పార్టీలో ఏనాడూ కీలక పదవులు పొందిన తెలుగు నాయకులు లేరు.  

ఖర్గే గారు.. కనిపించడం లేదా?
తాజాగా కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారా.. ఇవ్వరా అనే చర్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఖర్గే ఏర్పాటు చేసే  కొత్త టీమ్‌లో ప్రధాన కార్యదర్శులు కావాలని తెలంగాణ నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, మల్లు రవి వంటి సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి వర్కింగ్ కమిటీ పదవి కోసం కేవీపీ రామచంద్రరావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నారు. అందువల్ల కమిటీల్లో పదవులు భర్తీ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా తెలంగాణ నేతలు ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం ఖర్గేను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు