‘ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై నిషేధం’ ప్రతిపాదన లేదు

4 Dec, 2021 06:22 IST|Sakshi

కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌’ అని పేరున్న సంస్థలపై నిషేధం విధించాలన్న  ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అందించినందుకు గాను ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్‌ను భారత్‌లో నిషేధిస్తారా? అని రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి ప్రతిపాదన లేదన్నారు. దేశంలో సోషల్‌ మీడియా దుర్వినియోగం అవుతున్న సంగతి నిజమేనని అంగీకరించారు.

దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అభివృద్ధి చేసి, విక్రయించిన పెగాసస్‌ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుతోంది. పెగాసస్‌ స్పైవేర్‌ వాడకంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.  
 

మరిన్ని వార్తలు