UP CM: ఇది యూపీ.. ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి

13 Apr, 2022 15:53 IST|Sakshi

లక్నో: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా.. పలు రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ అల్లర్లను ప్రస్తావిస్తూ.. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శ్రీరామ నవమి సందర్భంగా.. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని, కనీసం నువ్వా-నేనా అనే స్థాయి కొట్లాట ఘటనలు వెలుగులోకి రాలేదని అన్నారు. ‘‘పాతిక కోట్ల జనాభా ఉన్న యూపీలో శ్రీరామ నవమి ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 800 ఉరేగింపు ఉత్సవాలు జరిగాయి. అదే సమయంలో రంజాన్‌, ఉపవాసాలు, ఇఫ్తార్‌ కార్యక్రమాలు జరిగాయి. అయినా కూడా ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఇది ఉత్తర ప్రదేశ్‌ కొత్త అభివృద్ధి ఎజెండాకు గుర్తు. ఇక్కడ అల్లర్లకు, శాంతిభద్రతల విఘాతానికి స్థానం లేదు. గుండాగిరి ఊసే లేదు’’ అని సీఎం యోగి పేర్కొన్నారు. 

ఈ ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా.. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. 

అయితే యూపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా.. ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. అయితే.. సీతాపూర్‌ జిల్లాలో భజరంగ్‌ ముని అనే మహంత్‌.. ముస్లిం అమ్మాయిలను ఉద్దేశిస్తూ.. చేసిన రేప్‌ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయన్ని అరెస్ట్‌ చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు