పార్లమెంటరీ స్థాయీ సంఘాల పునర్వ్యవస్థీకరణ

5 Oct, 2022 06:21 IST|Sakshi

చైర్మన్‌ పదవుల్లో ప్రతిపక్షాలకు మొండిచేయి 

న్యూఢిల్లీ:  పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునర్వ్యస్థీకరించింది. చైర్మన్‌ పదవులు అధికార బీజేపీ, మిత్రపక్షాలకే దక్కాయి. ప్రతిపక్షాలకు మొండిచెయ్యి ఎదురయ్యింది. ఇన్నాళ్లూ వివిధ స్టాండింగ్‌ కమిటీలకు చైర్మన్‌గా పనిచేసిన ప్రతిపక్ష ఎంపీలను తొలగించారు. హోంశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మనూ సింఘ్వీని తొలగించి, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ లాల్‌ను నియమించారు.

ఐటీ శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పోస్టు నుంచి కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ను తొలగించారు. షిండే వర్గం శివసేన ఎంపీ ప్రతాప్‌రావు జాదవ్‌ను నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పోస్టు నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ను పక్కనపెట్టారు. పరిశ్రమలపై స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నుంచి డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీ, రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ఒక్క చైర్మన్‌ పదవి లభించలేదు.   
 

మరిన్ని వార్తలు