వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్‌!

31 May, 2021 11:31 IST|Sakshi

మందుబాబులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి 

‘నో వ్యాక్సిన్, నో లిక్కర్’ దుకాణాల ముందు నోటీసులు

అలాంటిదేమీ లేదంటున్న అధికారులు

లక్నో: కరోనా మహమ్మారి  అంతానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒక్కటే శరణ్యం. ఈ నేపథ్యం ఉత్తర ప్రదేశ్‌లో ఇటావా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ప్రకటించగానే లిక్కర్‌షాపుల ముందు బారులు తీరే మందుబాబులకు షాకిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘నో వ్యాక్సిన్, నో లిక్కర్’ అనే విధానాన్ని అమలు చేయాలని లిక్కర్ షాపులకు స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే క్రమంలో మద్యం సేవించాలనుకునేవారికి వ్యాక్సిన్‌ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. 

కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మద్యాన్ని విక్రయించాలంటూ మద్యం షాపు యజమానులకు అధికారులు ఆదేశించారు. ఇటావా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎడిఎం) హేమ్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సైఫాయిలోని మద్యం దుకాణాల బయట పోస్టర్లు కూడా వెలిసాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ విక్రయించమని నోటీసుల్లో పేర్కొనడం విశేషం. అయితే ఇలాంటి ఉత్తర్వులేవీ తాము జారీ చేయలేదని ఇటావా జిల్లా ఎక్సైజ్ అధికారి కమల్ కుమార్ శుక్లా తెలిపారు. టీకాలు వేయడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అయితే మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయమని ఆదేశించలేదని ఆయన అన్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు 13వేల 777 కరోనా కేసులు నమోదయ్యాయి. 279మంది కరోనా కారణంగా మరణించారు. కాగా  జూన్ నెలలో  కోటి కరోనా వ్యాక్సిన్లను  ఇవ్వాలని యూపీ సర్కార్‌  లక్ష్యంగా పెట్టుకుంది. 

>
మరిన్ని వార్తలు