అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం

25 Oct, 2021 06:03 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యం: అమిత్‌ షా

జమ్మూ: జమ్మూకశ్మీర్‌ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్‌ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.  మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్‌ షా ఆదివారం భగవతీ నగర్‌లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు.

ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు.  అమిత్‌ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్‌ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు.

ఐఐటీ కొత్త క్యాంపస్‌ ప్రారంభం
రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్‌ షా ప్రారంభించారు.

మరిన్ని వార్తలు