మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు

9 Jan, 2021 13:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం రూపొందించిన తరుణంలో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఇరు కుటుంబాల సభ్యులకు కూడా లేదని తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్‌ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శనివారం తీర్పునిచ్చింది. లక్నోకు చెందిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో పెద్దల అభిష్టానికి విరుద్ధంగా గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని కుటుంబ సభ్యులు వేధించసాగారు. వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో జంట హైకోర్టును ఆశ్రయించింది. (వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు)

తమ ప్రేమకు వ్యతిరేకంగా పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని, తమకు రక్షణకు కల్పించాల్సిందిగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితులకు బాసటగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. యువతీ, యువకులు స్వేచ్ఛను హరించే హక్కు వారికి లేదని తేల్చిచెప్పింది.  అంతేకాకుండా నూతన దంపతులకు కొన్ని రోజుల పాటు పోలీసు భద్రతను కల్పించాల్సిందిగా స్థానిక డీఎస్పీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కుటుంబ సభ్యులను వదులుకుని వచ్చిన వధువుకు ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉందని, వెంటనే ఆమె పేరు మీద 3లక్షల రూపాయల నగదును జమచేయాలని పేర్కొంది. కాగా మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మధ్య ప్రదేశ్‌ సైతం ఇలాంటి చట్టాన్నే రూపొందించింది. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. (ప్రేమలో పడ్డవారిని శిక్షించడం నేరం)

మరిన్ని వార్తలు