రూ.10తో బర్గర్‌ ఆర్డర్‌ చేసిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

22 Oct, 2022 16:56 IST|Sakshi

నోయిడా: ప్రస్తుత కాలంలో బర్గర్లు, పిజ‍్జాలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాగే ఓ చిన్నారి బర్గర్‌ షాప్‌కు వెళ్లి బర్గర్‌ ఆర్డర్‌ చేసింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న రూ.10 నోటును తీసిచ్చింది. కానీ, ఆమె ఆర్డర్‌ చేసిన బర్గర్‌ ధర రూ.90. ఆ విషయం ఆ చిన్నారికి తెలియదు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఆ పాప బర్గర్‌ తింటూ చిరునవ్వుతో బయటకు వచ్చింది. ఇంతకీ లోపల ఏం జరిగిందనే విషయాన్ని బర్గర్‌ కింగ్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

నొయిడాలోని బొటానికల్‌ మెట్రో స్టేషన్‌కు దగ్గర్లోని బర్గర్‌ కింగ్‌ షాపులోకి 10 ఏళ్ల పాప వచ్చింది. తన పాకెట్‌లో ఉన్న రూ.10 అక్కడున్న సిబ్బంది చేతికిచ్చి బర్గర్‌ కావాలని కోరింది. అయితే, దాని ధర రూ.90 ఉన్నప్పటికీ అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారిని చూసి క్యాష్‌ కౌంటర్‌లోని వ్యక్తి మిగిలిన రూ.80 చెల్లించాడు. బర్గర్‌ అసలు ధర ఆ పాపకు చెప్పకుండానే కేవలం రూ.10కే బర్గర్‌ను తెప్పించి ఇచ్చాడు. దీంతో బర్గర్‌ అందుకున్న ఆనందంలో ఆ చిన్నారి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న సోషల్‌ మీడియా యూజర్‌ అమాయకంగా బర్గర్‌ కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారి ఫొటో తీశారు. ఆ ఫోటోను లైఫ్‌ మెంబర్‌ అనే ట్విటర్‌లో షేర్‌ చేయటంతో వైరల్‌గా మారింది. 

ఈ విషయాన్ని తెలుసుకున్న బర్గర్‌ కింగ్‌ సంస్థ యాజమాన్యం చిన్నారికి బర్గర్‌ అందించిన ఉద్యోగి ధీరజ్‌ కుమార్‌గా గుర్తించింది. తమ షాపులోకి వచ్చిన చిన్నారి పట్ల ధీరజ్‌ ప్రవర్తించిన తీరుకు ప్రశంసలు కురిపించింది. అంతే కాదు ఆ వ్యక్తిని సన్మానించింది. ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేసింది బర్గర్‌ కింగ్‌ ‘ఈ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మా నోయిడా బొటానికల్‌ గార్డెన్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న రెస్టారెంట్‌లో పని చేస్తున్న ధీరజ్‌ కుమార్‌ తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్నారు.’ అంటూ జరిగిన సంఘటనను గుర్తు చేసుకూంటూ పలు ఫోటోలు షేర్‌ చేసింది.

ఇదీ చదవండి: యువతి నృత్యం వివాదాస్పదం... పాక్‌ యూనివర్సిటీ నోటీసులు

>
మరిన్ని వార్తలు