ప్రియాంకకు సారీ చెప్పిన పోలీస్‌ సిబ్బంది

5 Oct, 2020 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: హథ్రాస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ప్రియాంక గాంధీపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన గౌతమ్‌బుద్ధ నగర్‌ పోలీస్‌ క్షమాపణలు చెప్పారు. ఈమేరకు నొయిడా జిల్లా పోలీస్‌ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. గుంపులుగా దూసుకొచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపుచేసే క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పింది. మహిళల గౌరవానికి, రక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని నొయిడా డీసీపీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, గత శనివారం ప్రియాంక, రాహుల్‌ హథ్రాస్‌ వెళ్తున్న క్రమంలో నొయిడా-ఢిల్లీ డైరెక్ట్‌ ఫ్లై ఓవర్‌ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
(చదవండి: రేప్‌లు ఆగాలంటే.. అమ్మాయిలు మర్యాదగా ఉండాలి..)

రాహుల్‌, ప్రియాంక హథ్రాస్‌ టూర్‌ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పెద్ద సంఖ్యలో జనం పోగబడటంతో పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీ ఝళిపించారు. దీంతో ప్రియాంక వారికి మద్దతుగా నిలిచారు. ఈక్రమంలోనే ఓ పోలీస్‌ ఆమెను నిలువరించే క్రమంలో కుర్తా లాగారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలకు మోదీ ప్రభుత్వంలో దక్కుతున్న గౌరమిదేనని పలువురు దుమ్మెత్తి పోశారు. అదేక్రమంలో ప్రియాంక వీరత్వం చూపారని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రశంసలు కురిపించాయి. ఇక హథ్రాస్‌ బాధితురాలికి న్యాయం చేస్తామని ప్రకటించిన ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: రేప్‌ కేసుల్లో న్యాయం జరగాలంటే...)

మరిన్ని వార్తలు