నోయిడా ట్విన్‌ టవర్స్‌: తిరిగి వస్తున్న జనం, సెల్ఫీలతో సందడి

30 Aug, 2022 03:01 IST|Sakshi

 ఎమెరాల్డ్‌ కోర్ట్, ఏటీఎస్‌ విలేజ్‌ 

సొసైటీల నివాసితుల రాక

విద్యుత్, నీరు, గ్యాస్‌ సరఫరాల పునరుద్ధరణ 

నోయిడా: ఉత్కంఠ రేపిన సూపర్‌టెక్‌ జంట టవర్ల కూల్చివేత ఆదివారం మధ్యాహ్నం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. పేలుళ్ల కారణంగా టవర్ల పరిసరాల్లోని రహదారులు, భవనాలు, చెట్లపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగింపు సాయంత్రం నుంచే మొదలైంది. అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న ఎమెరాల్డ్‌ కోర్ట్, ఏటీఎస్‌ విలేజ్‌ సొసైటీల నుంచి ఖాళీ చేయించిన కుటుంబాల్లో సగానికి పైగా తిరిగి తమ నివాసాలకు చేరుకున్నాయి. అధికారులు వారికి విద్యుత్, నీరు, వంటగ్యాస్‌ సరఫరాలను పునరుద్ధరించారు.

తమ నివాసాలు సురక్షితంగా ఉన్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారీ పేలుళ్లతో ఎమెరాల్డ్‌ కోర్ట్, ఏటీఎస్‌ విలేజ్‌ లోపల వెలుపల, ఇతర నివాస ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని చెట్లపై దుమ్ముధూళి దట్టంగా పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో పనివారిని రంగంలోకి దించారు. 500 మంది సిబ్బందితోపాటు, 100 నీటి ట్యాంకర్లు, 22 యాంటీ స్మోగ్‌ గన్స్‌లో ఊడ్చటం, తుడవటం వంటి పనులను చేపట్టినట్లు నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి తెలిపారు. టవర్ల కూల్చివేతతో ఏర్పడిన 80 వేల టన్నుల శిథిలాలను తొలగించేందుకు 3 నెలలు పడుతుందని ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ తెలిపింది. దీనిని వృథాగా పడేయకుండా రీసైకిల్‌ చేసి, తిరిగి వినియోగిస్తామని పేర్కొంది. 

సెల్ఫీలతో జనం సందడి 
టవర్లు కూలిన తర్వాత సోమవారం కూడా జనం అక్కడికి వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలకు సమీపంలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నివాస సముదాయాలను నిర్మించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అధికార బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పెద్ద అబద్ధాల కోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు