Noida Twin Towers Demolition: కట్టేందుకు మూడేళ్లు... కూల్చేందుకు...తొమ్మిదే సెకన్లు

22 Aug, 2022 05:15 IST|Sakshi

నోయిడా జంట భవనాలు వచ్చే ఆదివారం నేలమట్టం

3,500 కేజీల పేలుడు పదార్థంతో కూల్చివేత

చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో టెన్షన్‌.. టెన్షన్‌

మూడేళ్ల పాటు నిర్మించిన ఆకాశ హర్మ్యాలవి. తొమ్మిదంటే తొమ్మిదే సెకండ్లలో నేలమట్టం కానున్నాయి. నోయిడాలో అక్రమంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన జంట భవనాలు చూస్తుండగానే
కుప్పకూలనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని కూల్చడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ ట్విన్‌ టవర్స్‌ను ఎలా కూలుస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 

ఆగస్టు 28. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్‌ జంట భవనాలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేయనున్నారు. 40 అంతస్తులున్న ఈ భవనాలను ఆగస్టు 21నే కూల్చేయాల్సి ఉన్నా  భద్రతా ఏర్పాట్లకు అధికారులు గడువు కోరడంతో 28కి వాయిదా పడింది.

ఏం జరిగింది?
నోయిడాలో ఎమరాల్డ్‌ కోర్టు సమీపంలోని సెక్టార్‌ 93ఏలో ఎపెక్స్, సియాన్‌ ట్విన్‌ టవర్స్‌ ఉన్నాయి. ఎపెక్స్‌ ఎత్తు 102 మీటర్లు. దీన్ని 32 అంతస్తులతో నిర్మించారు. 95 మీటర్ల ఎత్తున్న సియాన్‌లో 29 అంతస్తులున్నాయి. ఈ జంట భవనాల్లో 915 ఫ్లాట్లు, 21 వాణిజ్య సముదాయాలు, రెండు బేస్‌మెంట్లున్నాయి. 2009లో సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ దీని నిర్మించింది. పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. అయితే పలు నిబంధనల్ని కంపెనీ గాలికొదిలేసింది.

నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరముండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్‌ కోర్టులోని టవర్‌కు మధ్య 9 మీటర్ల దూరం కూడా ఉంచలేదు. దాంతో ఎమరాల్డ్‌ కోర్టు నివాసులు 2012లోనే కోర్టుకెక్కారు. వీటి నిర్మాణం అక్రమమేనని తేలుస్తూ అలహాబాద్‌ హైకోర్టు 2014లో తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టులోనూ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. జంట భవనాల్ని కూల్చేయాల్సిందేనని కోర్టు 2021 ఆగస్టు 31న తీర్పునిచ్చింది. అందుకు ఈ నెలలో తుది గడువు ప్రకటించింది.

భద్రతా ఏర్పాట్లు ఇలా ?  
► ఇంత ఎత్తైన భవనాల కూల్చివేత వల్ల పరిసర ప్రాంతాలకు, ఇతర నివాసాలకు నష్టం లేకుండా చూడటం సవాలుగా మారింది. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు చేపట్టారు.
► ట్విన్‌ టవర్స్‌ సమీపంలోనిఎమరాల్డ్‌ కోర్టు, ఏటీఎస్‌ విలేజ్‌ సొసైటీస్‌లో నివసిస్తున్న 5 వేల మందిని ఆగస్టు 28న ఖాళీ చేయిస్తున్నారు. ఉదయం 7.30కి ఇళ్లు వీడి, సాయంత్రం ఎడిఫస్‌ కంపెనీ చెప్పాకే తిరిగి రావాలి.
► వారికి చెందిన 1200 వాహనాలను కూడా తరలిస్తున్నారు.
► టవర్స్‌ సమీపంలోని నోయిడా–గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకల్ని మధ్యాహ్నం 2.15 నుంచి 2.45వరకు నిలిపివేస్తారు.
► జంట భవనాలున్న ప్రాంతంలోకి ఆగస్టు 28 రోజంతా ప్రజలు, వాహనాలు, జంతువులు ఎవరినీ రానివ్వరు.
► చుట్టుపక్కల భవనాల్లోకి ధూళి, సిమెంట్‌ ముక్కలు పోకుండా మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు.
► పేల్చివేతతో చుట్టుపక్కల భవనాలకు నష్టం జరగకుండా జంట భవనాల చుట్టూ కందకం తవ్వారు. అదనపు భద్రత కోసం మధ్యలో అతి పెద్ద కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
► చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్‌ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది!
► అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుతున్నారు.

ఇలా కూలుస్తారు...
► కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30కు కంట్రోల్డ్‌ ఇంప్లోజన్‌ టెక్నిక్‌ సాయంతో కూల్చివేత  జరుగుతుంది.
► రెండు భవనాలూ తొమ్మిది సెకండ్లలో పేక మేడలా నేలకొరుగుతాయి. దీన్ని ఎడిఫిస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ పర్యవేక్షిస్తోంది.
► 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు.
► కూల్చివేతకు 3,500 కేజీల పేలుడు పదార్థాలను వాడుతున్నారు. రెండు భవనాల్లో ఏకంగా 9,600 రంధ్రాలు చేసి వాటిని నింపుతారు.
► సియాన్‌ టవర్‌లో పేలుడు పదార్థాలు నింపడం పూర్తయింది. ఎపెక్స్‌నూ పూర్తి కావచ్చింది.
► హర్యానాలోని పల్వాల్‌లో పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) నుంచి పేలుడు పదార్థాలు తెప్పిస్తున్నారు.
► కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి బ్రిటన్‌ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు.
► కూల్చివేతతో 25 వేల క్యూబిక్‌ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా. వీటి తొలగింపుకే కనీసం మూణ్నెల్లు పడుతుంది. వీటి డంపింగ్‌కు సూపర్‌టెక్‌ కంపెనీ 5 హెక్టార్లు కేటాయించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు