గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు

20 Aug, 2020 03:34 IST|Sakshi

బయట వారికే  కాంగ్రెస్‌ పగ్గాలు

కొత్త పుస్తకం ఇండియా టుమారోలో ప్రియాంక

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. తమ ఇంటి సభ్యులు కాకుండా బయట వ్యక్తులకే కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాలన్న తన సోదరుడు రాహుల్‌ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. పార్టీని నడిపే సత్తా కలిగిన నాయకులు ఎందరో ఉన్నారని తాజాగా విడుదలైన పుస్తకంలో తన మనసులో మాట వెల్లడించారు.

అమెరికా విద్యావేత్తలు ప్రదీప్‌ చిబ్బర్, హర్ష షాలు రచించిన ‘‘ఇండియా టుమారో : కన్వర్జేషన్‌ విత్‌ ది నెక్స్‌›్ట జనరేషన్‌ ఆఫ్‌ పొలిటికల్‌ లీడర్స్‌’’అన్న పుస్తకంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంపై ఆధారపడకుండా కాంగ్రెస్‌కు సొంత దారంటూ ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించినట్టుగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ద్వారా విడుదలైన ఆ పుస్తకం వెల్లడించింది. ‘‘రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా లేఖలోనే కాదు, చాలా సార్లు తన మనోగతాన్ని విప్పి చెప్పారు. మన కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదన్నారు. నేను కూడా రాహుల్‌కి మద్దతుగా ఉంటా’’అని ప్రియాంక చెప్పారు.

15 నెలల క్రితం ఇంటర్వ్యూ అది: కాంగ్రెస్‌
దేశంలో యువ రాజకీయ నేతల్ని పుస్తక రచయితలు గత ఏడాది ఇంటర్వ్యూ చేశారని, ప్రియాంక వెల్లడించిన అభిప్రాయాలు అప్పటివని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గత ఏడాది మే 25న రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని కూడా సలహా ఇచ్చారు.  గత ఏడాది జూలైలో అమెరికాకు చెందిన రచయితలు ప్రియాంక అభిప్రాయాన్ని  తెలుసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు  తాను వ్యతిరేకమని ప్రియాంక వారికి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్‌ చేసిన కృషిని ప్రియాంక కొనియాడారు. 

మరిన్ని వార్తలు