సంచలనం: జమ్ము కశ్మీర్‌ ఓటర్లుగా నాన్‌-లోకల్స్.. ‘బీజేపీ ఓటు రాజకీయం’పై లోకల్‌ ఫైర్‌

18 Aug, 2022 10:43 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. స్థానికేతరులను సైతం ఓటర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు.. ఓటు హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. సీఈవో హిర్దేశ్‌ కుమార్‌ స్వయంగా చేసిన ఈ ప్రకటన.. ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది అక్కడ. 

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌-లఢఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత.. తిరిగి రాజకీయ స్థిరత్వం నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఎన్నికల నిర్వహణ వీలైనంత త్వరలోనే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ఇప్పుడు ఈసీ ఓటర్లుగా స్థానికేతరులనూ గుర్తిస్తామని ప్రకటించడం విశేషం. 

ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు.. ఇలా బయటి నుంచి వచ్చి జమ్ము కశ్మీర్‌లో ఉంటున్న వాళ్లకు ఓటు హక్కు దక్కనుంది. అంతేకాదు వాళ్లు ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో ‘నివాసం’ అనే ఆప్షన్‌ తప్పనిసరేం కాదని, మినహాయింపు ఇస్తున్నామని జమ్ము కశ్మీర్‌ ఈసీ వెల్లడించింది. ఇక జమ్ము కశ్మీర్‌లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటు హక్కుకు అర్హులేనని, వాళ్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్‌ కుమార్ వెల్లడించారు.

అక్టోబర్‌ 1, 2022 వరకు పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు వచ్చే జమ్ము కశ్మీర్‌ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని,  నవంబర్‌ 25వ తేదీ లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హిర్దేశ్‌ కుమార్‌ వెల్లడించారు. 

జమ్ము కశ్మీర్‌లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. అందునా.. ప్రస్తుతంఉన్న ఓటర్లు లిస్ట్‌లో 76 లక్షల మందే ఉన్నారు.  ఈసీ తీసుకున్న స్థానికేతరులకు ఓటు హక్కు నిర్ణయంతో మరో పాతిక-ముప్ఫై లక్షలకు పైగా కొత్త ఓటర్లు.. జమ్ము కశ్మీర్‌ ఓటర్ల కింద జమ కానున్నట్లు అంచనా.

ఇక ఈసీ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని జమ్ము కశ్మీర్‌ స్థానిక పార్టీలు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఓటు రాజకీయమంటూ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి: అదానీకి జెడ్‌ కేటగిరి భద్రత

మరిన్ని వార్తలు